భూసార పరీక్షలకనుగుణంగా పంటలు వేయాలి
2,700 మట్టి నమూనాల సేకరణ
నాలుగు మండలాల్లో సర్వే
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ విద్యార్థి శిలేదార్ సంహిత
జ్యోతినగర్: భూసార పరీక్షలకనుగుణంగా పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ విద్యార్థిని శిలేదార్ సంహిత అన్నారు. ఎన్టీపీసీ కష్ణానగర్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థుల బృందం ‘బిగ్ డేటా–స్మాల్ ఫార్మర్స్’ అనే అంశంపై పెద్దపల్లి, కమాన్పూర్, మంథని, రామగుండం మండలాలలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,600 మంది రైతుల సమాచారంతోపాటు 2,700 మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు పత్తి దిగుబడి 200 కిలోల దిగుబడి వస్తుందని, 98శాతం మంది రైతులు భూసార పరీక్షలు చేయకుండానే పంట సాగుచేయడంతో ఆశించిన దిగుబడి రాలేదని వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువపంట దిగుబడి చేసేందుకు రైతులకు సాయం చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రీసెర్చ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దహగామ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.