‘టాప్’కు 45 మంది అథ్లెట్లు ఎంపిక
శిక్షణ కోసం ప్రస్తుతం రూ.97 లక్షలు విడుదల
న్యూఢిల్లీ : టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి ఆరు క్రీడాంశాల నుంచి 45 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ఈ స్కీమ్ కింద వీరికి తగిన ఆర్థిక సహాయం లభించనుంది.
► టాప్ పథకం కింద ఆటగాళ్లపై రూ.30.075 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికి రూ.96.80 లక్షలు విడుదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన, నిలకడ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు క్రీడా శాఖ తెలిపింది.
► వీరందరికీ అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో పాటు సుశిక్షితులైన కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
► ఈ మేరకు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)తో క్రీడా శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో జాతీయ క్రీడా అభివృద్ధి నిధికి ఐఐఎఫ్‌సీఎల్ రూ.30 కోట్లు ఇవ్వనుంది. ప్రతీ ఏడాది రూ.10 కోట్లు ఇస్తుండగా ఈసారి ఆ నిధులను బ్యాడ్మింటన్‌కు వినియోగించనున్నారు. బ్యాడ్మింటన్ నుంచి సైనా, కశ్యప్, సింధు, గురుసాయిదత్, శ్రీకాంత్, ప్రణయ్ ఈ జాబితాలో ఉన్నారు.
► ఐదుగురు అథ్లెట్లకు రూ.12.5 లక్షల నుంచి రూ.కోటి వరకుమంజూరయ్యాయి. ఇందులో వికాస్ గౌడ (అథ్లెటిక్స్), అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, సంజీవ్ రాజ్‌పుత్, మానవ్‌జిత్ సింగ్ సంధూ (షూటింగ్) ఉన్నారు.
► రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్ ఒక్కొక్కరికి రూ.75 లక్షలు... బజరంగ్, రాహుల్ అవారె... మహిళా రెజ్లర్లు వినేష్ ఫోగత్, బబితా కుమారి రూ.45 లక్షల చొప్పున పొందుతారు.
► సెయిలర్లు వర్ష గౌతమ్, ఐశ్వర్యలకు రూ.45 లక్షల చొప్పున అందుకుంటారు. బాక్సర్లు మేరీకోమ్, విజేందర్, సరితా దేవి, దేవేంద్రో సింగ్‌లకు రూ. 75 లక్షల చొప్పున.. పింకీ జంగ్రా, శివ థాపా, మన్దీప్, వికాస్‌లకు రూ.45 లక్షల చొప్పున అందుతాయి.
► మహిళా డిస్కస్ త్రోయర్లు సీమా అంటిల్‌కు రూ.75 లక్షలు, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్, 20 కి.మీ. రే స్ వాకర్లు ఖుష్బీర్ కౌర్, కేటీ ఇర్ఫాన్లకు రూ.45 లక్షల చొప్పున ఇస్తారు. అలాగే ‘టాప్’లో తమ పేర్లు లేవని ఇప్పటికే క్రీడా శాఖపై ధ్వజమెత్తిన డబుల్స్ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పేర్లను కూడా త్వరలోనే చేర్చుతామని ఆ శాఖ తెలిపింది.