Saina Movie: ‘సైనా’ మూవీ రివ్యూ
టైటిల్: సైనా
జానర్: బయోపిక్
నటీటులు: పరిణీతి చోప్రా, మానౌవ్ కౌల్, ఇషాన్ నఖ్వీ, మేఘనా మాలిక్, సుబ్రజ్యోతి బరాత్, అంకుర్ విశాల్ తదితరులు
నిర్మాతలు: భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, సుజయ్ జైరాజ్, రాశేష్
దర్శకత్వం: అమోల్ గుప్త
సంగీతం: అమాల్ మాలిక్
సినిమాటోగ్రఫీ: పీయూష్ షా
విడుదల తేది : మార్చి 26, 2021(ఏప్రిల్ 23న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది)
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా పరిణీతి చోప్రా కీలక పాత్రలో అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైనా’. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 50% అక్యూపెన్సీతో రన్ అవ్వడంతో సైనాకు కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇప్పడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు‘సైనా’లో కొత్తగా ఏం చూపించారు? సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.
కథ
ఒక చిన్న పట్టణంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బాలిక సైనా నెహ్వాల్(పరిణీతి చోప్రా)కు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. తల్లి కూడా కుమార్తె ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంది. సైనాను ఎలాగైనా బాడ్మింటన్ ప్లేయర్‌ని చేయాలనుకుంటారు. డబ్బులు అంతగా లేకున్నా ట్రైనింగ్ కోసం ఓ కోచ్ వద్దకు పంపిస్తారు. ఒకానొక దశలో కాక్స్ కొనడానికి డబ్బులు లేకుంటే తన తండ్రి ఫీఎఫ్ లోన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? స్టార్ ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి ఆటుపోటులు ఎదురయ్యాయి? కష్టకాలంతో తనకు తోడుగా నిలిచిందెవరు? ఆట కోసం వ్యక్తిగత జీవితంలో సైనా కోల్పోయిందేంటి? తన విజయంలో కోచ్ పాత్ర ఏ మేరకు ప్రభావితం చేసిందనేదే మిగతా కథ.
నటీనటులు
సైనా పాత్రలో పరిణీతి చోప్రా పరకాయ ప్రవేశం చేసింది. అసలైన బ్యాడ్మింటన్ ప్లేయర్లా కనిపించడానికి పరిణీతి పడిన కష్టం అంతా తెరపై కనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా, సహజసిద్దంగా చేసింది. సైనా తల్లిగా మేఘనా మాలిక్ అద్భుతంగా నటించారు. తండ్రిగా సుబ్రజ్యోతి ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇక ఈ సినిమాలో పరిణీతి తర్వాత బాగా పండిన మానవ్ కౌల్ది. సైనా కోచ్ రాజన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సైనా బాయ్‌ఫ్రెండ్ పారుపల్లి కశ్యప్ పాత్రలో ఇషాన్ నఖ్వీ ఉన్నంతలో బాగానే నటించారు. సైనా చిన్నప్పటి పాత్ర చేసిన పాప నైషా కౌర్ కూడా అద్భుతంగా నటించింది.
విశ్లేషణ
ప్రముఖుల జీవిత చరిత్రను తెరపై చూపించడం కత్తిమీద సాము లాంటిదే. వారి జీవితాన్ని వెండితెరపై ఎంత భావోద్వేగభరితంగా చూపించారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు అమోల్గుప్త సఫలమయ్యాడనే చెప్పాలి. స్టార్ బాడ్మింటన్గా ఎదగడానికి సైనా పడిన కష్టాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రథమార్థంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా సైనా చిన్నప్పుడు కోచింగ్‌కు తీసుకెళ్లడానికి తల్లి పడే ఆరాటం, షటిల్ కొనడానికి తండ్రి అప్పు చేసే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కోచ్ రాజన్, సైనాల మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి.
ఫస్టాప్ అంతా సైనా బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన విషయాలు చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కూడా దాన్నే కంటిన్యూ చేయడం కాస్త ప్రతికూల అంశమే. అలాగే కశ్యప్‌తో ప్రేమ వ్యవహారాన్ని కూడా అంతగా చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమాకు మరో బలం అమాల్ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. పీయూష్ షా సినిమాటోగ్రాఫి అద్భుతమనే చెప్పాలి. బాడ్మింటన్ కోర్టును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. గేమ్ సన్నివేశాలను భావోద్వేగభరితంగా, ఉద్విగ్నంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.