భారత సైనికుల పాత్ర అభినందనీయం
కాకినాడ రూరల్:
పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో అద్భుత ప్రతిభను కనబరచిన భారత సైని కుల పాత్ర అభినందనీయమని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామి అన్నారు. ఆయన శుక్రవారం రమణయ్యపేటలోని శ్రీపీఠంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత సైనికుల సంక్షేమం కోసం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు నెలలపాటు తాను అమెరికాలో పర్యటించినట్టు ఆయన తెలిపారు. అమెరికన్లు భారత్లో పండుతున్న పసుపుతో చేసిన మాత్రలు వాడి వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారన్నారు. అయితే మన దేశంలో అమెరికా ప్రవేశపెడుతున్న బర్గర్లు, పిజ్జాలు వంటివి తిని, వారి మందులను వాడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కోటికుంకుమార్చన నిర్వహిస్తున్నామన్నారు. శ్రీపీఠం ఆధ్వర్యంలో ఏడు ఎకరాల్లో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసి దేశవాళీ ఆవులను పెంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకు ఒక ఆవు, దూడను అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దేశంలో 32 రకాల జాతులకు చెందిన ఆవులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 13కి పడిపోయిందన్నారు. ఆవు జాతులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.