పాఠశాల నడుస్తుండగానే కూల్చివేత
హైదరాబాద్: పాఠశాల నడుస్తుండగానే కూల్చివేసిన ఘటన హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో చోటుచేసుకుంది. స్థానిక సాయిరామ్ హైస్కూల్ భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. తరగతి గదుల్లో విద్యార్థులుండగానే జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం హుటాహుటిన విద్యార్థులను బయటకు పంపించేసింది. ముందస్తు ఆదేశాలు లేకుండా ఒక్కసారిగా కూల్చివేయడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు.
అక్రమంగా నిర్మించారనే కారణంతో ఐదు అంతస్థుల పాఠశాల భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించామని తమ చర్యను జీహెచ్ ఎంసీ అధికారులు సమర్థించుకున్నారు. తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేని సాయిరామ్ హైస్కూల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వాపోయారు.
ఎటువంటి హెచ్చరికలు లేకుండా జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబట్టింది. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులను వివరణ కోరనున్నట్టు తెలిపింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఇంతకుముందు కూడా సికింద్రాబాద్ ఓ ఇంటిని ఎవరూలేని సమయం చూసి కూల్చివేశారు.