సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’పేరిట తెలుగులోకి అనువదించారు. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంబర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు శుక్రవారం సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది. ఆయా వివరాలు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా ఎస్.శేషారత్నం, వై.ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్ పుస్తకం ఆవిష్కరించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
నలుగురికి భాషా సమ్మాన్ అవార్డు
అకాడమీ కార్యనిర్వాహక బోర్డు 2019కిగానూ నాలుగు రీజియన్ల భాషా సమ్మాన్ అవార్డులను ప్రకటించింది. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంపై చేసిన కృషికిగానూ ప్రొఫెసర్ దయానంద్(ఉత్తరం) ఎ.దక్షిణామూర్తి (దక్షిణం), సత్యేంద్ర నారాయణ్ గోస్వామి(తూర్పు), మహమ్మద్ అజం (పశ్చిమ)లను ఎంపిక చేసినట్లు పేర్కొంది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
వివిధ వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా...
‘2022లోనూ మనదేశంలో ‘మ్యానువల్ స్కావెంజింగ్’ వంటి అమానవీయ పద్ధతులు అమలు కావడం అత్యంత విషాదం. ఈ పనుల్లో నిమగ్నమైన వారి బాధ, ఆత్మాభి మానం, ఘోషను సభ్యసమాజానికి చాటి చెప్పాలనుకున్నాం. ఈ అవార్డు ద్వారా ఎంతోకొంత మార్పు వచ్చినా మేం విజయవంతమైనట్టుగా భావిస్తాం. కొన్ని వర్గాల ప్రజలు ఆయా విధుల నిర్వహణ పేరిట ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారు, వారి పట్ల సమాజం ఎలాంటి దృష్టిని కలిగి ఉందనేదానిని చర్చనీయాంశం చేసేందుకు ఈ పుస్తకం పనికొస్తుంది.
వివిధ వర్గాల ప్రజలకు ఈ సమస్య తీవ్రత అర్థమ య్యేందుకు ఈ రచన దోహదపడితే అంతకంటే సంతోషం ఉండదు. ఈ సమస్య చుట్టూ ముడిపడిన అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి నా బాధ్యతగా ఈ అను వాదం చేశాను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పర్యటించి, విస్తృత పరిశీలన, లోతైన విశ్లేషణలు, అభిప్రాయాల సేకరణ ద్వారా మాతృక రచయిత్రి భాషాసింగ్ హిందీలో ఈ రచన చేశారు’ అని సజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. (క్లిక్: పిల్లలు చెప్పిన పేరెంట్స్ కథ)