‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి.
అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా.
ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది.
సాయం ఎప్పుడూ ఉంటుంది
ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు.