అవున్నిజమే! మన రూపాయల్లో కోటి 24 లక్షల రూపాయల పైమాటే. అంత ఖరీదెందుకు, ఏమిటా వైన్ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా! ఆ వైన్ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి! ఇదంతా జపాన్‌కు చెందిన ప్రముఖ సేక్ (వైన్) బ్రాండ్ దస్సాయ్ తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పంపించి అక్కడ పులియబెట్టాలని యోచిస్తోంది.
ఇది విజయవంతమైన మీదట కేవలం 100 మి.లీ. వైన్ బాటిల్‌ను ఏకంగా రూ.5.53 కోట్లకు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్టును 2025లో లాంచ్ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది చూడాలి.
చంద్రుడే లక్ష్యంగా..
ప్రయోగం గనుక సక్సెసైతే ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుందని అసాహి షుజో కంపెనీ బ్రూవర్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి సౌయా ఉట్సుకి చెప్పారు. ‘‘అయితే ఈ పరీక్ష 100% విజయవంతమవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే మా ప్రయత్నం వెనుక కేవలం ఘనత కోసం కాదు. అంతరిక్షంలో కిణ్వ ప్రక్రియ ఏ మేరకు జరుగుతుందన్న దానిపై మా కంపెనీ దృష్టి పెట్టింది. జరిగితే ఏదో ఒకనాడు చంద్రుడిపైనా వైన్‌ను పులియబెట్టడం మా కంపెనీ లక్ష్యం.
మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుంది. పర్యాటకులు చంద్రునిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది మా ఉద్దేశం. అంతేగాక పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే భావి అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటో, మిసో వంటి జపనీస్ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి.
ఏమిటీ సేక్?
సేక్ ఒక రకమైన వైన్ లేదా సారాయి. జపనీస్ బియ్యం, నీరు, ఈస్ట్, కోజీ (ఒక రకమైన అచ్చు) తో తయారవుతుంది. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలలు పడుతుంది. ఇది జపాన్ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్ బ్రాండ్లలో దస్సాయ్ అత్యంత ప్రాచుర్యం పొందింది.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment