కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
- నగరంలో దొంగల హల్చల్
- 12 తులాల బంగారు నగల అపహరణ
- మరో ఇంట్లో సెల్‌ఫోన్ చోరీకి విఫలయత్నం
- వరుస చోరీలతో నగరవాసులు బెంబేలు
అనంతపురం క్రైం :నగరంలో దొంగలు పేట్రేగిపోతున్నారు. సాధారణ ప్రజలతోపాటు పోలీసుల ఇళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఓ కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మరో ఇంటిలో సెల్‌ఫోన్ చోరీకి విఫలయత్నం చేశారు. బాధితుల కథనం మేరకు... సాయినగర్ ఏడో క్రాస్‌లో రిటైర్డ్ ఏఎస్ఐ వలి నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో వెనుక వైపు కూతురు ఫర్హానా పర్వీన్, అల్లుడు షాకీర్‌బాషా ఉంటున్నారు. షాకీర్‌బాషా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్. విధుల్లో భాగంగా గురువారం రాత్రి షాకీర్ స్టేషన్‌కు వెళ్లాడు.
భార్య పర్వీన్ తన తల్లిదండ్రుల ఇంటికెళ్లి అక్కడే నిద్రపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటాక దొంగలు చొరబడి షాకీర్ ఇంటి గొళ్లెం పెకలించి లోనికి ప్రవేశించారు. రెండు బీరువాలనూ పగులకొట్టారు. ఒక బీరువాలోని 12 తులాల బంగారాన్ని అపహరించారు. ఈ సమయంలో దొంగలు రిటైర్డ ఏఎస్ఐ వలి ఇంటి తలుపునకు స్క్రూడ్రైవర్‌తో గడియపెట్టారు. ఇంట్లో వారికి మెలకువ వచ్చినా బయటకు వచ్చేందుకు వీలు లేకుండా చేశారు. ఈ ఇంట్లో పని పూర్తి చేసుకున్న దొంగలు షాకీర్ ఇంటిపక్కనే వైద్యవిద్యార్థులు ఉంటున్న ఇంటివైపు వెళ్లారు. వైద్య విద్యార్థి గౌతంకుమార్ ఊరి వెళుతున్న తన స్నేహితులను బస్టాండ్‌కు వదిలేందుకు బస్టాండ్‌కు వెళ్లాడు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని దొంగలు తొలగించి లోనికెళ్లగా సెల్‌ఫోన్ ఒక్కటే దొరికింది.
దాన్ని తీసుకుని బయల్దేరుతుండగా సరిగ్గా తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బస్టాండ్ నుంచి గౌతంకుమార్ బైక్‌లో వచ్చాడు. బైక్ శబ్దం వినగానే ఒక దొంగ ఒక్క ఉదుటున గోడపై నుంచి మరో ఇంటివైపు దూకి పారిపోయాడు. ఈ క్రమంలో దొంగ తీసుకెళ్తున్న గౌతం సెల్‌ఫోన్ కిందకు పడింది. వెంటనే గౌతం ఆ సెల్‌ఫోన్ తీసుకుని.. రిటైర్డ్ ఏఎస్ఐ వలి కుటుంబసభ్యులను నిద్ర లేపాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ షాకీర్బాషాకు సమాచారం అందించాడు. ఇంట్లో పరిశీలించగా 12 తులాల బంగారం దోచుకెళ్లినట్లు బాధితులు గుర్తించారు. వీరి ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ సుబ్బరాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతానికి పాల్పడిన వ్యక్తి ఒంటినిండా బురద పూసుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎవరైనా పట్టుకునేందుకు వచ్చినా...తప్పించుకునేందుకు వీలుగా ఉంటుందని బురద పూసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరుస చోరీలతో నగరవాసుల బెంబేలు
ఇటీవల వరుస చోరీలతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 17న రాత్రి సాయినగర్‌లో రాధాకృష్ణ నివాసంలో దొంగలు పడి 11 తులాల బంగారం, కేజీ వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. 18న రాష్ర్ట పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇంటి పక్కనే ఉన్న రిటైర్డ ఆడిట్ ఆఫీసర్ వై.పుల్లారెడ్డి ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించి, ఫర్నీచరు ధ్వంసం చేశారు. 21న సాయంత్రం పాపంపేటలో వెంకటనాయుడు ఇంట్లోకి ఒక దొంగ దూరి చెవికమ్మలు అపహరించాడు. తాజాగా గురువారం అర్ధ రాత్రి దాటాకసాయినగర్లో కానిస్టేబుల్ షాకీర్‌బాషా ఇంట్లో 12 తులాల బంగారం చోరీ అయింది. ఈ మూడు చోరీలు, బీభత్సం సంఘటన టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధలోనే జరగడం గమనార్హం. ఇవికాకుండా చిన్నచితకా దొంగతనాలు అధికమయ్యాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి గట్టి నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.