సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ షార్ట్‌లిస్టు షురూ
ఎంట్రీలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2015’కు ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎక్స్‌లెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్-ఎన్జీవో, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్‌కు సంబంధించి ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన ఎంట్రీలను జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ రమా మేల్కొటే, డాక్టర్ బాలాజీ ఉట్లా, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ మంగళవారమిక్కడ పరిశీలించి స్కోర్ ఇచ్చారు. ఫార్మర్ ఆఫ్ ద ఇయర్‌కు సంబంధించిన ఎంట్రీలను ఐసీఏఆర్ మాజీ పాలకవర్గ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, సేంద్రియ రైతు కొటపటి మురహరి రావు, ప్రొఫెసర్ శ్యామ్‌సుందర్ రెడ్డి పరిశీలించారు.
తుది విజేతను ఫైనల్ జ్యూరీ ఎంపిక చేయనుంది. ‘‘మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న ఎన్జీవోలను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచిది. దాదాపు ఎంట్రీలకు వచ్చిన సంస్థల సేవలన్నీ బాగున్నాయి’’ అని ప్రొఫెసర్ రమా మేల్కొటే ఈ సందర్భంగా అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం ద్వారా మరెన్నో ఎన్జీవోలు దీక్షతో పనిచేసే అవకాశముందని జీవన్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, చట్టాలను ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్జీవోలను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా చేస్తున్న కార్యక్రమం మరిందరికి స్ఫూర్తినివ్వాలని డాక్టర్ బాలాజీ ఉట్లా అన్నారు.
సంస్థలు, వ్యక్తులతోపాటు రైతులను ప్రోత్సహించే విధంగా అవార్డులు ఇవ్వడం అభినందనీయమని ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా సాగుచేస్తూ భూమిని, పర్యావరణాన్ని కాపాడాలని, ఈ దిశగా కృషి చేస్తున్న రైతుల్లో ఉత్సాహం నింపేందుకు సాక్షి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయమని శ్యామ్‌సుందర్ రెడ్డి, కొటపటి మురహరిరావు అన్నారు. ఈ సందర్భంగా షార్ట్‌లిస్ట్ జ్యూరీ సభ్యులకు సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి జ్ఞాపికలు అందజేశారు. బుధవారం ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఎడ్యుకేషన్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(లార్జ్ స్కేల్), బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ (స్మాల్/మీడియం స్కేల్), ఎక్స్‌లెన్సీ ఇన్ హెల్త్‌కేర్ ఎంట్రీలను జ్యూరీ సభ్యులు పరిశీలిస్తారు. ఏప్రిల్ 17న ఆయా విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు.