ఐసిస్ పాశవికం: నీళ్లలో మరగబెట్టి చంపేశారు!
వేడివేడి నీటి చుక్క ఒక్కటి ఒంటిపై పడితేనే విలవిల్లాడిపోతాం. అలంటిది బతికున్న మనుషుల్ని బాగా మరగబెట్టిన నీళ్లలో ప్రాణాలు పోయేంతవరకు ఉడకబెట్టారు. విభిన్న తరహాలో శిక్షలు అమలు చేస్తూ ఇప్పటికే పైశాచికం పీక్స్ కు వెళ్లిన ఐసిస్ అగ్రనేతలు.. ఇప్పుడు తమ మాట వినని జిహాదీలను మరిగే నీళ్లలో ముంచుతున్నారు.
ఇరాక్, సిరియాల్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్.. ఆ దేశాల భద్రతా దళాలతో నిత్యం తలపడుతూనేఉంది. జులై 4న బాగ్ధాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోని లాహుద్దీన్ ప్రావిన్స్ లో ఇరాకీ దళాలతో ఐసిస్ ఉగ్రవాదులు తలపడ్డారు. ఓవైపు పోరు జరుగుతుండగానే ఐసిస్ కు చెందిన ఏడుగురు జీహాదీలు యుద్ధభూమి పారిపోయారు. ఆదేశాలు పాటించకుండా పలాయనం చిత్తగించిన ఆ ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ లెవవన్ట్ (ఐఎస్ఐఎల్) మరణ శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశంలో పొయ్యిని ఏర్పాటుచేసి, దానిపైన భారీ గిన్నెలో నీళ్లు మరిగించి ఏడుగురిని అందులో ముంచి చంపారు.
ఐఎస్ తన జిహాదీలను చంపుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆదేశాలు పాటించని వారిని కర్కషంగా చంపిన సందర్భాలున్నాయి. అయితే నీళ్లలో మరగబెట్టి చంపడం మాత్రం ఇదే మొదటిసారి. గత నెలలో 19 మంది జిహాదీలను తుపాకితో కాల్చిచంపిన ఐసిస్ అగ్రనేతలు.. మే నెలలో మౌసూల్ పట్టణంలో 25 మంది అనుమానిత గూఢచారులను నైట్రిక్ యాసిడ్ లో ముంచి చంపేశారు. సిరియాలో పట్టుపడ్డ ఐదుగురు జర్నలిస్టులను గత నెల(జూన్ లో) పీకలుకోసి చంపారు. బందీలుగా చిక్కిన ఇతర జాతుల మహిళలను కూడా ఐసిస్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేస్తారు. చంపడం లేదా చావడం అనే నినాదం నుంచి చంపకపోతే చంపుతాం అనే బలవంతపు యుద్ధంలోకి యువకులను దించుతున్న ఐసిస్ నిజంగా ఓ రాక్షస బృందం.