దివాకర్ల, విశ్వనాథల సమ్మేళనమే ‘శలాక’
పంచ సప్తతి గోష్ఠిలో మహా మహోపాధ్యాయ గోపాలకృష్ణ
జటావల్లభులకు ‘శలాక విద్వత్’ పురస్కార ప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ :
విఖ్యాత పండితుడు దివాకర్ల వేంకటావధాని వినయసౌజన్యాలను, సుప్రసిద్ధ రచయిత విశ్వనాథ సత్యనారాయణ పాండితీగరిమను ప్రాచార్య శలాక రఘునాథశర్మలో చూడవచ్చని మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస, శంకరుల ఆర ్షవాజ్ఞ్మయ ప్రచారమే రఘునాథశర్మ జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ధర్మంచర కమ్యూనిటీహాల్లో జరిగిన రఘునాథ శర్మ పంచసప్తతి పూర్తి అభినందన గోష్ఠిలో విశ్వనాథ మాట్లాడుతూ శలాక శతమానోత్సవం కూడా నగరంలో జరగాలని ఆకాంక్షించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు శలాక రచించిన సప్త గ్రంథాలను ఆవిష్కరించారు. శలాక విశ్వగురువు అని కొనియాడారు. శలాక ఇటీవల రచించిన రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము, మహాత్ములు– మణిదీపాలు, కల్పవృక్ష వాగ్వైభవము, ఉత్తర గీతాసౌరభము, స్ఫురణాదీపకలికలు, పంచామృతరసవాహిని, భాగవత నవనీతము’ గ్రంథాలను భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు సభకు పరిచయం చేశారు. ఆదిత్య హృదయాన్ని గీతతో సమన్వయం చేస్తూ శలాక రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము’ గ్రంథాన్ని పరిచయం చేస్తూ.. భారతంలో గీత, రామాయణంలో ఆదిత్య హృదయము– రెండూ యుద్దభూమిలోనే చెప్పబడ్డాయని, రెండింటిలో శ్రోతలు(అర్జునుడు, శ్రీరాముడు) దైన్యస్థితిలో వాటిని విని, ఉత్తేజితులయ్యారని తెలిపారు. అనంతరం రఘునాథశర్మ ‘మహాభారత ధర్మజ్ఞ’ జటావల్లభుల జగన్నాథాన్ని ‘శలాక విద్వత్సమర్చన పురస్కారం’ పేరిట రూ.30,000 నగదుతో సత్కరించారు. అన్నజ్ఞాన సమారాధన యజ్ఞాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు. సాహితీవేత్తలు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, అరిపిరాల నారాయణరావు, గురజాల హనుమంతరావు శలాకకు అభినందనలు తెలిపారు. హాజరైన సాహితీవేత్తలు శలాకను ఘనంగా సత్కరించారు. వెదురుపాక విజయదుర్గా పీఠం తరఫున అడ్మినిస్ట్రేటర్ వి.బాపిరాజు శలాకకు ఆశీస్సులందజేశారు. నగరంలోని సాహితీకారులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.