sales girl
-
ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ
చినుకులా మొదలై..సునామీలా చుట్టేస్తున్న ‘చిను కలా’ స్టోరీ వింటే..ఎక్కు తొలి మెట్టు.. కొండని కొట్టు ఢీకొట్టు. గట్టిగా పట్టే నువు పట్టు...గమ్యం చేరేట్టు అన్న సినీ కవి మాటలు గుర్తు రాకమానవు. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే. ఆ కష్టాలు, కడగండ్లే సరికొత్త భవిష్యత్తుకు పునాది. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. ప్రసిద్ధ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ యాక్సెసరీస్ డైరెక్టర్ చిను కలా సక్సెస్ స్టోరీ: 1981 అక్టోబర్ 10న రాజస్తాన్‌లో పుట్టిన చిను స్కూల్లో చదువుకుంటున్నపుడే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోంచి పారిపోయింది. ముంబైలోని సెయింట్ అలోసియస్ 10వ తరగతి చదువుతున్నపుడే.. దాదాపు 15 ఏళ్లకే పొట్టకూటికోసం రోడ్డుమీద పడింది. ఇంటి గడపదాటే నాటికి ఆమె వద్ద కేవలం రూ. 300, ఒక బట్టల బ్యాగ్ మాత్రమే ఉన్నాయి. (నిజానికి 13 ఏళ్ల వయస్సప్పుడే తండ్రి ఇంట్లోంచి పొమ్మంటూ అవమానించాడట) ఏం చేయాలో అర్థం కాక ముంబైలోని రైల్వే స్టేషన్లో రెండు రోజులు పడుకుంది. ఒక మూల కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కంటికి ధారలా ఏడ్చింది. డోర్-టు-డోర్ సేల్ గురించి ఒక మహిళ ద్వారా తెలుసుకుని చివరికి సేల్స్‌గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. (ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్) ముంబై లాంటి మహానగరంలో ఒంటరిగా, అదీ సేల్స్ గర్ల్‌గా ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టు తిరుగుతూ అనేక అవమానాలను ఎదుర్కొంది. అందరూ ఈమె ముఖం మీదే తలుపులు వేసేవారు. వంద ఇళ్లు తిరిగితే ఒకటో రెంటో అమ్మ గలిగేది. దీనికి తోడు అక్కడ పనిచేసేవాళ్లందరికీ ఒకటే హాలు, వంటగదీ లేదు. వాష్ రూం అంతకన్నా లేదు. దుర్భర జీవితం. అయినా ఓడిపోలేదు. ఆరు-ఏడు నెలల తర్వాత లీడర్‌గా మారింది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకే కదిలింది. అలుపెరుగని జీవన పోరాటంలో పట్టు వదలక ఒక్కో మెట్టు ఎక్కుతూ రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీ రూబన్స్ యాక్సెసరీస్ యజమానిగా అవతరించింది. అంతేనా స్నేహితుల ప్రోత్సాహంతో 2007లో, గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా అందాల పోటీలకు ఎంపికైంది. అలా ఫ్యాషన్ ,ఆభరణాల ప్రపంచానికి పరిచయం అయింది. మోడల్‌గా రాణించింది. ఈ ప్రయాణంలో వెయిట్రెస్‌గా పనిచేయడంతోపాటు ఎన్నో రకాల పనులు చేసింది. అలా ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం రావడం ఆమె జీవితంలో ఒక పెద్ద బ్రేక్ , అక్కడే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమిత్ కలాతో పరిచయం ప్రేమగా కారింది. 2004లో అమిత్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టింది. చిను కలలకు రెక్కలిచ్చిన భర్త భర్తగా,వ్యాపారవేత్తగా అమిత్ చినుకి కొండంతగా అండగా నిలిచాడు. నైపుణ్యాలను మెరుగుపరిచాడు. వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలకు రెక్కలిచ్చాడు. ఫలితంగా 2008లో కార్పోరేట్ మర్చండైజింగ్‌లో నైపుణ్య కంపెనీ ఫాంటే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎదురైన ప్రతి సవాల్‌ను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చిన చిను కలా 2014లో బెంగళూరు మాల్లోని చిన్న కియోస్క్ నుండి రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. 2021 నాటికి తన బ్రాండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి పలువురి ప్రశంసలు అందుకుంది. తనలాంటి చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇపుటు కోట్ల టర్నోవర్‌తో సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్‌గా రాణిస్తోంది. భర్త, కుమార్తతో కలిసి బెంగళూరు, ఫీనిక్స్ మాల్ సమీపంలోని 5వేల చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న చిను గరాజ్లో ఖరీదైన బీఎండబ్ల్యూ-5 కారు కొలువు దీరడంలో ఆశ్చర్యం ఏముంది? పోటీని ఎదుర్కోవాలంటే..రెండడుగులు ముందుండాలి! పోటీని ఓడించాలంటే.. ప్రత్యర్థులకంటే రెండు అడుగులు ముందుండటమే ఏకైక మార్గం అంటారు చిను. అందమైన డిజైన్లుతో ఏడాదికి కనీసం 10-12 కలెక్షన్లను తీసుకొస్తూ రూబన్స్ యాక్సెసరీస్ పాపులర్ అయిందని, మార్కెట్లో భారతీయ ,పాశ్చాత్య డిజైన్లను కలిగి ఉన్న ఏకైక బ్రాండ్ మాదే అంటారామె. ఇటీవీల షార్క్ ట్యాంక్ ఇండియా 2 తాజా ఎపిసోడ్లో, చిను కలా , అమిత్ కలా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ప్రయాణం, డిజైనర్ జ్యువెలరీ బ్రాండ్-రూబన్స్ గురించిన విశేషాలు పంచు కోవడం అందిరినీ ఆకర్షించింది. రోజుకు 15 గంటలుకు మించి పనిచేస్తానంటూ చిను. దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ వాటాలో(రూ. 21000 కోట్లు అంచనా) భవిష్యత్తులో 25 శాతం వాటాను సాధించాలనేదే చిను లక్క్ష్యం. -
తాళిబొట్టు కోసం యముణ్ణి వెంటాడినట్టు వెంటాడింది!
‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. కేరళలోని కొల్లం జిల్లా, తెవలక్కార పట్టణం. సౌమ్య 28 ఏళ్ల యువతి. చక్కగా చురుగ్గా ఉంటుంది. భర్త టైలర్. ఇద్దరు పిల్లలు. శోభన ఐదవ తరగతి, సోనా మూడవ తరగతి. గడచిన వారం వరకు ఆమెను అందరూ ఓ సాధారణమైన సేల్స్గాళ్, ఇద్దరు బిడ్డల తల్లిగానే గుర్తించారు. ఇప్పుడామె కొల్లం జిల్లాలోనే సెలబ్రిటీ. సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్ ఆమెకిప్పుడు. కన్నుగీటి ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిన ప్రియాప్రకాశ్ వారియర్ కంటే ఈ వారియరే ఇప్పుడు అక్కడ ఫేమస్. సీన్ అంతగా మలుపు తిరగడానికి ఆమె ఏం చేసింది? సినిమా షూటింగ్‌ను తలపిస్తూ చేజ్ చేసింది. చైన్ స్నాచర్స్‌ను ఒడిసి పట్టుకుని చాచి కొట్టింది. తన తాళిమాల(మంగళసూత్రం)ను తెచ్చుకుంది. ఉద్యోగం నుంచి సాయంత్రం తన స్కూటీ మీద ఇంటికి వస్తున్నప్పుడు సౌమ్యను ఒక బైక్ వెంబడించింది. బైక్ మీద ఇద్దరు యువకులు ఆమె పక్కగా బండిని పోనిస్తూ ఆమె మెడలోని తాళిబొట్టు దండను లాక్కున్నారు. క్షణకాలం పాటు ఆగిపోయిన సౌమ్య వెంటనే తేరుకుంది. దారిన పోయే వారికి ఏం జరిగిందో తెలిసేలా ‘దొంగ... దొంగ... పట్టుకోండి’ అని అరుస్తూ స్కూటీ మీద గొలుసు దొంగలను వెంబడించింది. ‘దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరం వెంబడించి వారి బైక్ ను ఓవర్టేక్ చేసి వారి ఎదురుగా వచ్చింది. ఆ వేగంలో ఆమె స్కూటీ బైక్‌ను ఢీకొడుతూ ఆగింది. పరుగున వచ్చిన వారు, ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే అరుపులతో గుమిగూడిన వారు బైక్ నడుపుతున్న యువకుడిని ఒడిసి పట్టుకున్నారు. సౌమ్య అతడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. చైన్ ఉన్న వాడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా రంగంలో దిగారు. పారిపోతున్న దొంగను నిమిషాల్లోనే పట్టుకున్నారు. సౌమ్య దండ సౌమ్యకు చేరింది. కథ సుఖాంతం. ‘‘మెడలోని దండను వాళ్లు లాక్కుపోతే వెంబడించడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత దూరం బండి మీద దొంగలను పట్టుకోవడానికి వెళ్లడమంటే చిన్న విషయం కాదు. నువ్వు చేసింది ఎంతటి సాహసమో తెలుసా?’’ అని ప్రశంసాపూర్వకంగా అడిగిన వాళ్లకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. ఎలాగైనా వాళ్లను పట్టుకుని దండతోనే ఇంటికి వెళ్లాలనే కసితో వెంబడించాను. అందుకే భయం వేయలేదు’’ అంటోంది. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ అని కేరళలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సౌమ్యను రోల్‌మోడల్‌గా చూపిస్తున్నారు ఇప్పుడు. కేరళకే కాదు, సౌమ్య మొత్తం దేశానికే మోడల్ ఉమన్. – మంజీర -
బాలికపై లైంగిక దాడి
గుంటూరు : మాయమాటలు చెప్పి ఓ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై లాలాపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. సేకరించిన సమాచారం మేరకు గుంటూరులోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న రెహనా జాస్మిన్ తనతోపాటు పనిచేసే సంగడిగుంట ఎల్ఆర్ కాల నీకి చెందిన బాలిక (17)తో స్నేహంగా ఉండేది. జాస్మిన్ బుధవారం విజయవాడలో షాపింగ్ కోసం తన బావతో పాటు కారులో వెళదామని స్నేహితురాలిని ఒప్పించింది. జాస్మిన్ బావ ఇలియాజ్ కారులో ముగ్గురూ విజయవాడ చేరుకున్నారు. విశ్రాంతి కోసం మనోరమ హోటల్లో రూములో దిగారు. జాస్మిన్, ఇలియాజ్ కలసి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికకు ఇచ్చారు. మత్తులోకి జారుకున్న బాలికపై ఇలియాజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తు నుంచి కోలుకున్న అనంతరం ముగ్గురూ గుంటూరు చేరుకున్నారు. తనపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని గ్రహించిన బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
యువతి ఆత్మహత్య
నిడదవోలు, న్యూస్‌లైన్ : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడదవోలులో శనివారం జరిగిం ది. ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయపేట రామాల యం వీధిలో ఏనుగుల బండారిమేరీప్రసన్న రాణి(18), ఆమె తల్లి మేరీ రాధారాణి నివసిస్తున్నారు. శనివారం ఉదయం రాధారాణి టిఫిన్ తెచ్చేం దుకు హోటల్‌కు వెళ్లింది. టిఫిన్ తె చ్చిన ఆమె తలుపులు లోపల గడియపెట్టి ఉండటంతో చాలా సేపు కుమార్తెను పిలిచించి. అయినా తలుపులు తీయకపోవడంతో కంగారుగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్న ప్రసన్నరాణి కనిపిం చింది. వెంటనే ఆమెను కిందకు దింపగా అప్పటికే మృతిచెందింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని ఓ క్లాత్ షోరూంలో ప్రసన్నరాణి ఐదేళ్ల నుంచి సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రాయపేటకు చెందిన గున్నాబత్తుల నానాజీ, ప్రసన్నరాణి ప్రేమించుకున్నారు. నానాజీ మరో యువతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఈనెల 30న నానాజీతో పాటు అతని తండ్రి, సోదరుడు ఆమె ఇంట్లోనే తల్లి రాధారాణి సమక్షంలో పంచాయితీ పెట్టారు. నానాజీ మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి లక్ష రూపాయలు ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నరాణి ఆత్మహత్య చేసుకుంది. మృతురా తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని కొప్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం
హైదరాబాద్: డ్యూటీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... న్యూమారుతీ నగర్లో నివసించే ఆటోడ్రైవర్ కత్తుల పరశురాములు కూతురు మౌనిక(20) చైతన్యపురిలోని అనిల్ ట్రేడింగ్ షోరూంలో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది. మంగళవారం డ్యూటీకని వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. షోరూంలో వాకబు చేయగా తనతో పనిచేసే హాసినితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఆమెకు ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎక్కడ వెతికినా జాడ తెలియక పోవటంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.