4 రోజుల లాభాలకు బ్రేక్
తొలుత +140, తుదకు -110
- 25,474 వద్ద ముగిసిన సెన్సెక్స్
- తొలిసారి 7,700ను తాకిన నిఫ్టీ
- రియల్టీ, మెటల్, విద్యుత్, ఆయిల్ డీలా
- 2%పైగా లాభపడ్డ ఐటీ ఇండెక్స్
నాలుగు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్ నీరసించింది. లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయింది. 25,474 వద్ద ముగిసింది. అయితే తొలుత 140 పాయింట్ల వరకూ లాభపడింది. ఉదయం సెషన్లో 25,736 వద్ద కొత్త గరిష్టాన్ని చేరింది. ఆ స్థాయిలో అమ్మకాలు పెరగడంతో మిడ్ సెషన్‌కల్లా లాభాలు కోల్పోవడమేకాకుండా 184 పాయింట్ల వరకూ నష్టపోయింది. 25,366 వద్ద కనిష్ట స్థాయిని చవిచూసింది. ఇక నిఫ్టీ కూడా మార్కెట్ చరిత్రలో తొలిసారి 7,700 పాయింట్లను తాకడం విశేషం. ఆపై ఒడిదుడుకులకులోనై చివరికి 30 పాయింట్ల నష్టంతో 7,627 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 778 పాయింట్లు పుంజుకున్న విషయం విదితమే.
ఎఫ్ఐఐల అమ్మకాలు
ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.2% పతనంకాగా, మెటల్, విద్యుత్, ఆయిల్ రంగాలు 3-2% మధ్య నష్టపోయాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ 8-3% మధ్య దిగజారాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, హిందాల్కో, కోల్ ఇండియా, భెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, సెసాస్టెరిలైట్, భారతీ, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, ఐటీసీ, ఎల్అండ్టీ 5-1.5% మధ్య తిరోగమించాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హీరోమోటో 3.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, ఎఫ్ఐఐలు రూ. 313 కోట్లు, దేశీ సంస్థలు రూ. 404 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో తిరోగమించాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,647 లాభపడితే, 1,487 నష్టపోయాయి.