సిలికాన్ సిటీకి సన్ స్ట్రోక్
తల్లడిల్లుతున్న ఉద్యాన నగరి
రెండు, మూడు రోజులుగా తీవ్ర ఎండలు, వేడి గాలులు
ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే ప్రమాదం
సాధారణం కంటే పెరిగిన ఉష్ణోగ్రత
బళ్లారి, రాయచూరు, గుల్బర్గలలో అత్యధికం
ఊపందుకున్న శీతల పానీయాల విక్రయాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భానుడి ప్రతాపంతో నగర వాసులు అల్లాడి పోతున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఎండలను చూడలేదనే మాట అందరి నోటా వినబడుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉక్కపోత. బస్సుల్లో వెళుతుంటే వేడి గాలులు. రెండు, మూడు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కొద్ది దూరం నడిచినా ఆయాసం ఆవరిస్తోంది.
ఈ నెలలో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతోంది. వేసవిలో బళ్లారి, రాయచూరు, గుల్బర్గలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం బెంగళూరు కూడా వాటికి ఏ మాత్రం తీసిపోవడం లేదని నగర వాసులు వాపోతున్నారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఎండ వేడిమి నుంచి బయటపడడానికి నగర వాసులు శీతల పానీయాలు, కొబ్బరి నీరును ఆశ్రయిస్తుండడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి.
ధర కూడా చుక్కలనంటుతోంది. సాధారణంగా మార్చిలో ఓ మోస్తరు వర్షాలు పడిన అనంతరం వేసవి ప్రారంభం కావడంతో గతంలో పెద్దగా ఎండలనిపించేవి కావు. ఈసారి అలాంటి వర్షాలు లేకపోవడం శాపంగా పరిణమించింది. సమీప భవిష్యత్తులో వానలు కురిసే అవకాశాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ చేరుతుందేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతోంది. మరో వైపు కోస్తాతో పాటు పలు జిల్లాల్లో పడుతున్న చెదురు మదురు వర్షాలతో స్థానికులు మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.