'సెలైన్ వల్ల ప్రవళిక మృతి చెందలేదు'
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పురుగులున్న సెలైన్ ఎక్కించడం వల్ల ప్రవళిక మృతి చెందిందన్న వార్త అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారి మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదన్నారు.
(చదవండి ...పురుగుల సెలైన్: చిన్నారి మృతి)
చిన్నారికి పోస్టుమార్టం అవసరంలేదని కుటుంబసభ్యులు లిఖితపూర్వకంగా కోరడంతోనే పోస్టుమార్టం నిర్వహించలేదని చెప్పారు. ప్రవళికకు వచ్చిన వ్యాధి లక్ష మందిలో ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. సెలైన్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించామన్నారు. 62 రోజుల పాటు నిపుణులైన వైద్య బృందంతోనే చికిత్స అందించామని తెలిపారు.
అంతకు ముందు ప్రవళిక తండ్రి భిక్షపతి మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నీ బిడ్డ చనిపోతే చనిపోతుంది..అదేమైనా పెద్ద విషయమా' అని అన్నారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. మీడియాకు చెబుతావా.. కేసులు పెడతానంటూ బెదిరించారని భిక్షపతి వాపోయారు.