ఫైలిన్ తుపానుపై అప్రమత్తం
* తుపానుకు ముందస్తు చర్యలు
* కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002
* ప్రతి మండలానికి ప్రత్యేకాధికారి నియామకం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమాచారం అందింది. దీంతో అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు అప్రమత్తం చేశారు.
కలెక్టరేట్లో డిప్యూటీ తహశీల్దార్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఉన్న అన్ని పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు, ఉద్యోగులందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మెలో ఉన్నారు.
కానీ సమ్మెలో ఉంటూనే అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. వీరితో పాటు మండలాధికారులు, వీఆర్వోలు, ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉండాలని బుధవారం సాయంత్రం నుంచి అధికారులు సమాచారమందిస్తున్నారు. గత ఏడాదిలో వచ్చిన నీలం తుపాను కారణంగా జిల్లాలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
పంటలు, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. కేవలం గ్రామాల్లోనే కాకుండా నగరంలో కూడా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ‘న్యూస్‌లైన్’ చెప్పారు. నగరంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన అత్యవసర సామగ్రిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
నేడు అత్యవసర సమావేశం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ సాల్మర్ ఆరోఖ్యరాజ్ గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో మండలాధికారులు, తహశీల్దార్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఏజెన్సీలో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి స్థానికులను సురక్షిత ప్రాంతలకు తరలించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని ఆర్డీఓలను ఇప్పటికే ఆదేశించారు.