ఉప్పు ద్రావణంతో సోయా గింజలకు రక్షణ
కోతకు వచ్చిన సోయాచిక్కుళ్లను ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలు దెబ్బతీస్తున్నట్లు సమాచారం. జూన్ 3వ వారంలో విత్తిన సోయాచిక్కుళ్లు పంటలో మొదట వచ్చిన కాయలు కోతకు అందివస్తున్నాయి. అయితే, ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల మూలంగా సోయా మొక్కలకు ఉన్న కాయల్లో గింజలు మొలకెత్తి బూజు పట్టి పాడైపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. జూన్ 3వ వారంలో విత్తిన పంటలో తొలి కాయలు పక్వానికి వస్తున్న దశలో వర్షాలు రావడంతో కాయలు చెట్టుకు ఉండగానే గింజలు మొలకెత్తుతున్నాయని, బూజు పట్టి కాయలు రంగు మారి పాడైపోతున్నాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. గడ్డం రాజశేఖర్ తెలిపారు.
సోయా గింజలకు నిద్రావస్థ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. సోయాబీన్స్ విస్తారంగా సాగవుతున్న ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని యవత్మాల్, వార్థా జిల్లాల్లో కూడా ఈ సమస్య గత మూడేళ్లుగా రైతులను వేధిస్తున్నదన్నారు. వర్షం వెలసిన తర్వాత.. 5% ఉప్పు (అంటే.. 100 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి) ద్రావణాన్ని సోయా పంటపై పిచికారీ చేస్తే కాయల్లో గింజలు మొలకెత్తే సమస్యను అధిగమించవచ్చని డా. రాజశేఖర్ (83329 45368) వివరించారు.