‘ఇరానీ’ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: బెంగాల్‌తో రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్...బౌలింగ్ చేయడానికి పరుగు ప్రారంభించిన బౌలర్... బ్యాట్స్‌మన్‌కు ఏదో సమస్య ఎదురు కావడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ స్థితిలో మరో బౌలర్ ఎవరైనా మళ్లీ వెనక్కి వెళ్లి తన మార్క్‌నుంచి మొదలు పెట్టేవాడు.
కానీ మహారాష్ట్ర లెఫ్టార్మ్ పేసర్ సమద్ ఫలా ఎక్కడ ఆగిపోయాడో అక్కడినుంచి పరుగు మొదలు పెట్టి అదే వేగంతో బాల్ వేశాడు. టేపు ద్వారా తమ మార్కింగ్‌ను కచ్చితంగా కొలుచుకుంటే గానీ లయను అందుకోలేని చాలా మందితో పోలిస్తే ఇది విశేషమే!
క్రికెట్లో ‘స్నేక్ బాల్’ అంటే ఏమిటో తెలుసా...బౌలింగ్ వేసేటప్పుడు నేరుగా పరుగెత్తకుండా అటు ఇటు ‘జిగ్‌జాగ్’ చేస్తూ వచ్చి బంతి విసరడం. భారత దేశవాళీ క్రికెట్లో ఇలా కూడా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన ఏకైన పేసర్ ఫలానే! ఇలాంటి అంశాలతో భిన్నంగా కనిపించే సమద్... ఇప్పుడు రంజీ ట్రోఫీలో తాజా సంచలనం. క్వార్టర్ ఫైనల్లో ముంబైపై 7 వికెట్లు, సెమీ ఫైనల్లో బెంగాల్‌పై 10 వికెట్లు తీసి మహారాష్ట్రను ఫైనల్‌కు చేర్చాడు. ఇక తాను పుట్టిన గడ్డపై ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
భారత జట్టులోకి వస్తా...
తాజా సీజన్లో చూపిన ప్రదర్శనతో తనకు ఒక్కసారిగా గుర్తింపు దక్కిందని ఫలా ‘సాక్షి’తో చెప్పాడు. ఓవరాల్‌గా తన రికార్డు బాగుందని, ఏదో ఒక రోజు భారత జట్టు తరఫున ఆడతానని, అందుకు వయసు అడ్డంకి కాదని చెప్పాడు. ‘క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది నా వయసులో జాతీయ జట్టులోకి వచ్చారు. లెఫ్టార్మ్ సీమర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. ఇరు వైపులా బంతిని స్వింగ్ చేయగలను. ఇక భిన్నమైన బౌలింగ్ శైలి, యాక్షన్ నా బలంగా భావిస్తా. ఎందుకంటే దాంతోనే నేను 200 వికెట్లు తీయగలిగాను’ అని సమద్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికైతే తాను జన్మించిన హైదరాబాద్‌లో రంజీ ట్రోఫీని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమద్ అన్నాడు.
చాయ్, సమోసా...సమద్
28 ఏళ్ల సమద్ హైదరాబాద్‌లోనే పుట్టాడు. వారికి తాతల కాలంనుంచి నగరంలో ఇరానీ హోటళ్లు ఉండేవి. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకుంటూ గల్లీల్లో క్రికెట్ ఆడిన ఫలా... కుటుంబ వ్యాపార విస్తరణ నిమిత్తం పుణే వెళ్లాడు. అయితే నగరంతో అతని అనుబంధం మాత్రం మారలేదు. తండ్రి పుణేలో ‘ఆల్ఫా’ పేరుతో ఇరానీ హోటల్ నిర్వహిస్తుండగా...ఫలా సొంత సోదరి హైదరాబాద్‌లోనే ఉంటుంది.
రెండు ప్రముఖ ఇరానీ హోటళ్లు ఇప్పుడు అతని కుటుంబ సభ్యులే నడిపిస్తున్నారు. చిన్నప్పటినుంచి చదువుపై ఆసక్తి చూపించని ఈ కుర్రాడు... తండ్రికి హోటల్లోనే సహాయకారిగా పని చేశాడు. 19 ఏళ్ల వయసు వచ్చే వరకు సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడిన అతను అండర్-16, అండర్-19 లాంటి ఏ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. ఆ తర్వాత మూడేళ్లు కూడా ఇరానీ హోటల్‌కే పరిమితమయ్యాడు.
ఆరంభం అదిరింది...
అయితే మూడేళ్ల తర్వాత తండ్రి కోరికపై మళ్లీ బంతి పట్టాడు. ఈ సారి సీరియస్‌గా సాధన చేశాడు. మహారాష్ట్రలో జరిగిన ఓపెన్ సెలక్షన్స్ టోర్నీలో పాల్గొని 9 మ్యాచ్‌ల్లో 73 వికెట్లు పడగొట్టడంతో నేరుగా రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌లో అవకాశం దక్కింది. కోచ్ పండిట్‌కు ఫలా బౌలింగ్ శైలి నచ్చలేదు. అయినా అవకాశం ఇచ్చారు. 22 ఏళ్ల వయసులో నేరుగా రంజీ ట్రోఫీతోనే సమద్ పోటీ క్రికెట్లోకి అడుగు పెట్టాడు.
హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు అతను మహారాష్ట్ర జట్టులో కీలక సభ్యుడు. గత ఐదు మ్యాచుల్లో 29 వికెట్లు తీసి మహారాష్ట్ర ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 50 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్లో ఫలా 28.09 సగటుతో 201 వికెట్లు పడగొట్టాడు. నాలుగేళ్ల క్రితం ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయి బెస్ట్ బౌలర్‌గా నిలిచి తాను అభిమానించే వసీం అక్రమ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు.