సమరనాదం
సాక్షి, అనంతపురం: సమైక్యవాదుల ర్యాలీలతో 24వ రోజు అనంతపురం నగరం హోరెత్తింది. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ బీసీ నాగరాజు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి నిరసన తెలిపారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, డ్వామా, ఐకేపీ, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాతీరాజ్ ఉద్యోగుల, విద్యత్, మున్సిపల్ ఉద్యోగులు, నీటిపారుదల ఉద్యోగులు, ఆల్‌మేవా ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ దీక్షా శిబిరాల్లో సమైక్య వాదులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. నగరంలోని ప్రజలు గ్రూపులు.. గ్రూపులుగా ప్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి, టవర్‌క్లాక్, శ్రీకంఠం సర్కిళ్లలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ఎస్కేయూలో కొనసాగుతున్న దీక్షలు
ఎస్కేయూలో విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆద్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్బీఎన్ ప్రొఫెసర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆ కళాశాల అధ్యాపకులు యూనివర్సిటీకి చేరుకుని రిలేదీక్షలకు మద్దతు తెలిపారు. ఆకుతోటపల్లి ఆటోస్టాండ్ డ్రైవర్లు ఆట్లోలతో ఎస్కేయూ వరకు ర్యాలీ చేశారు. రాజు అనే ఆటో డ్రైవర్ ఆకుతోటపల్లె నుంచి రోడ్డుపై పొర్లుదండాలు పెట్టుకుంటూ యూనివర్సిటీకి వచ్చాడు. అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు ఆధ్వర్యంలో ఇటుకలపల్లి వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం చెక్కభజన, కోలాటాలతో ర్యాలీగా వర్సిటీకి వ చ్చి రిలేదీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు మద్దతు తెలిపారు. ఇటుకలపల్లె గ్రామస్తులతో వంటా వార్పు నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
నిరసనల హోరు
ధర్మవరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు, ఆటో యునియన్ వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఐక్య ఉపాధ్యాయ సంఘం దీక్షలకు ఎమ్మెల్సీ గేయానంద్, చార్లెస్ చిరంజీవిరెడ్డితో పాటు నగరంలోని న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. ఎరికల సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. బత్తలపల్లి, ముదిగుబ్బలలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
గుంతక ల్లులో న్యాయవాదులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయులు వ్యాయామం చేస్తూ నిరసన తెలిపారు. గుత్తి, పామిడిలో జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కుల సంఘాల వారు పట్టణంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో వడ్డెర్లు, మైనార్టీలు, పశుసంవర్థక శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు రిలే దీక్ష చేపట్టారు.
డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు గొడుగులు చేతబట్టి వినూత్నంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు జాతీయ జెండాతో కుటుంబ సమేతంగా ర్యాలీ చేశారు. నల్లచెరువులో ముస్లింలు వారి పద్దతి మేరకు సోనియా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తలుపులలో ఆర్టీసీ కార్మికులు రిలేదీక్షలు చేపట్టారు. గాండ్లపెంటలో సమైక్యవాదులు రోడ్డుపైనే వంటా-వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంజారాల భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యవాదులు మాయల పకీర్ వేషధారణతో ప్రదర్శన నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శెట్టూరులో రజకులు గాడిదలతో ర్యాలీ చేశారు. వ్యవసాయశాఖ అధికారులు రిలేదీక్షలు చేపట్టారు. కుందుర్పిలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. కంబదూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మడకశిరలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అమరాపురంలో సమైక్యవాదులు ఆటో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. పుట్టపర్తిలో బలిజసంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఓడీసీ, అమడగూరు, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులో ప్రజాసంఘాలు, ఉపాధ్యాయులు, సమైక్యవాదులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
పెనుకొండలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో జాతీయరహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసి..రాష్ర్ట విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సోమందేపల్లెలో రెవిన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో వైఎస్సార్సీపీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పరిగిలో వడ్డెర్లు ర్యాలీ నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర కాలేజీ విద్యార్థులు, పండ్లవ్యాపారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి..రోడ్డుపైనే వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుతల్లి చేతులకు సంకెళ్లు వేసి జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
న్యాయవాదులు రోడ్డుపైనే క్రికెట్ ఆడి..వంటా-వార్పు చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. రాప్తాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సీకేపల్లెలో జాతీయరహదారిపై వాల్మీకిసంఘం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి..వంటా -వార్పు చేపట్టారు. ఆత్మకూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శింగనమల, గార్లదిన్నె, పుట్టూరు, యల్లనూరు, బీకేఎస్ మండలాల్లో వైఎస్సార్సీపీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి.. పిండప్రదానం చేశారు.
జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై స్నానం చేసి.. కేసీఆర్‌కు పిండ ప్రదానం చేశారు. వికలాంగుల సంక్షేమసంఘం గౌరవాధ్యక్షులు నాగార్జునరెడ్డి చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరులో సమైక్యవాదులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మద్దతు తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. యాడికిలో వాల్మీకిసంఘం నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బెళుగుప్పలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. వజ్రకరూరులో సమైక్యవాదులు రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు.