జేఏసీ దీక్షలో అనుచిత వ్యాఖ్యలు
పత్తికొండ టౌన్/అర్బన్, న్యూస్‌లైన్ : జేఏసీ నాయకుల సమైక్యాంధ్ర దీక్షల సందర్భంగా ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సమైక్యవాదులకు ఆగ్రహం తెప్పించాయి. సమైక్యాంధ్ర కు మద్దతుగా సోమవారం పత్తికొండలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన అనంతరం ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీమాంధ్రవాళ్లను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లాలని చెబుతున్న కేసీఆర్ ముక్కు కోసి మూసీ నదిలో కలిపేస్తామని హెచ్చరించారు.
ఇదే సమయంలో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ నాయకుడు హరికృష్ణ గురించి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం హరికృష్ణే కాదు పత్తికొండలో ఉలిగెమ్మలు ఉద్యమం చేసిన మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్య సమైక్యవాదులను అవమానపరిచేలా ఉందంటూ జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే కేఈ డౌన్..డౌన్, ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి సర్దిచెప్పినా వారు శాంతించలేదు. అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో సమైక్యవాదుల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి క్షమాణలు చెప్పారు.
తన మాటల వల్ల జేఏసీ నాయకులు బాధ పడి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్ష చేస్తున్న వారందరికీ పాదాభివందనం చేస్తామన్నారు. దీంతో సమైక్యవాదులు శాంతించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు టీఎండీ హుసేన్, సాయిబాబా, అల్లిపీరా, ప్రసాద్‌బాబు, నర్సోజీ చందూనాయక్, గోవిందరాజులు, బాబురావు, నజీర్, రామ్మోహన్‌రెడ్డి, చెరువు శ్రీనివాసులు, జకీర్‌హుసేన్, రుక్మిణమ్మ, విశాలాక్షి పాల్గొన్నారు.