నగరంలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమ జోరు ఏమాత్రం తగ్గ లేదు. ఉద్యోగులు, విద్యార్థులు, పలు సామాజికవర్గాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమంలో 23వ రోజైన శుక్రవారం కూడా నగరాన్ని భారీ ప్రదర్శనలు, ఆందోళనలతో హోరెత్తించారు. మరోపక్క ఉద్యోగులు సడలని పట్టుదలతో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వస్తుండటంతో ఉద్యమానికి మరింత బలం చేకూరుతోంది. ఆందోళనలు ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు.
పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో..
పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు, గిడ్డంగుల ముఠా కూలీల సంఘం ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన చేశారు. సంతపేటలోని కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు.. అక్కడి నుంచి తిరిగి చర్చి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విభజనకు అంగీకరించేది లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట వంటా-వార్పు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దుర్గాప్రసాద్, ఆనందరావు పాల్గొన్నారు.
మత్స్యకారుల ఆందోళన
సమైక్యాంధ్రకు మద్దతుగా మత్స్యకార యూనియన్ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ ఆందోళన చేపట్టారు. వలలు, చేపల ప్రదర్శనతో స్థానిక కర్నూలు రోడ్ ఫ్లయిఓవర్ బ్రిడ్జి నుంచి అద్దంకి బస్టాండ్, మస్తాన్‌దర్గా, మిరియాలపాలెం సెంటర్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై వలలు పరిచి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని, కుట్ర పూరితంగా రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్‌రావు, కె.తిరుపతిరావు, జక్రయ్య, వెంకటరమణ, గోవిందు, వై.రమణ, బ్రహ్మయ్య, రామలింగం, సుబ్బారావు, తిరుపతిరావు పాల్గొన్నారు.
విద్యార్థుల భారీ ప్రదర్శన
సమైక్యాంధ్ర ఫ్రంట్, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఫ్లయిఓవర్ బ్రిడ్జి నుంచి అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్ బొమ్మ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీశ్, ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్ పాల్గొన్నారు.
బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక లాయరుపేటలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. త్యాగమూర్తుల త్యాగ ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని, తెలుగు జాతిని కాపాడాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. దీక్షలో కె.కుసుమకుమారి, జ్వాలాపతి, సీహెచ్ శారద, కాశీబాబు, ఎస్ఏటీ రాజేశ్, చిలకపాటి వెంకట రంగరావు పాల్గొన్నారు. దీక్షలను బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు బి.వెంకటసుబ్బారావు, సీహెచ్ వెంకట సుబ్బారావు, డీఎస్ క్రాంతికుమార్, సీహెచ్ నర సింహారావు ప్రారంభించారు.
పంచాయతీరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో..
పంచాయతీరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రిలే దీక్షులు చేపట్టారు. దీక్షను జెడ్పీ సీఈఓ గంగాధర్‌గౌడ్ ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులకు తీరని అన్యాయం చేసే రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో కె.విద్యాసాగర్‌రెడ్డి, ఎం.జగదీశ్వరరెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసరావు, కేఎన్ఎస్ రాంబాబు, ఎం.మురళి, బాషా, రామసుబ్బారావు, షేక్ జిలానీబాషా, సీహెచ్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఉద్యోగుల దీక్ష
సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు. దీక్షలో ఆర్ఓ మంజులాకుమారి, ఒ.సుజాత, వరలక్ష్మి, పద్మా, సుబ్బాయమ్మ, శేషగిరి, రమేశ్, శ్రీనివాసరెడ్డి, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట..
స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల సామూహిక రిలే దీక్షలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం దీక్షలో కమర్షియల్ ట్యాక్స్, వెటర్నరీ, ఆయుష్ శాఖలకు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులు కూర్చున్నారు. సమైక్య రాష్ట్రం సాధించుకునే వరకూ పోరాటాన్ని విరమించేది లేదని నాయకులు తేల్చి చెప్పారు. దీక్షకు ఎన్జీఓ నాయకులు షేక్ అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివారావు, రాజ్యలక్ష్మిలు సంఘీభావం తెలిపారు.
జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో..
ప్రకాశం జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కన్వీనర్ రావి శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇరు ప్రాంతాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. దీక్ష శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు, రెవెన్యూ సర్వీసెస్ నాయకుడు కేఎల్ నరశింహారావు, రవికుమార్, రాయపాటి జగదీశ్‌లు సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షలో వెంకట్రావు, పెట్లూరి, ఖలీఫాతుల్లాబాషా, ఎం.మాల్యాద్రి పాల్గొన్నారు.