మోదీ కోసం కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఇదే!
యూపీ ఎన్నికల కోసం వ్యూహం సిద్ధం
లోకల్ కుర్రాళ్లు వర్సెస్ బయటి మోదీ
ఇదే ఎస్పీ-కాంగ్రెస్ నినాదం
లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. 'అప్నే లడ్కే, బహ్రీ మోదీ' (మన కుర్రాళ్లు వర్సెస్ బయటి మోదీ) నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ బాస్ రాహుల్‌గాంధీలను స్థానిక కుర్రాళ్లుగా.. మోదీని బయటి వ్యక్తిగా అభివర్ణిస్తూ.. ఎన్నికల్లో బీజేపీని ఢీకొనాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. యూపీలోని వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్రమోదీ ఛరిష్మాపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఎస్పీలో అంతర్గత కుటుంబపోరు ముగిసిన తర్వాత.. మంతనాలు, చర్చల అనంతరం ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల యువనేతలు ప్రధాన ఆకర్షణగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుతో యూపీలో 18శాతం ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా తమవైపు మొగ్గుతాయని ఆశాభావంతో ఉంది. ప్రచారంలో రాహుల్, అఖిలేశ్ కలిసి ప్రచారం చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్న ఎస్పీ వర్గాలు.. ప్రియాంకగాంధీ, అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కలిసి ప్రచారం చేసే అంశాన్ని మాత్రం కొట్టిపారేయడం లేదు. ప్రియాంక- డింపుల్ జోడీ 'నారీశక్తి'గా ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశముంది.
గత ఏడాది ఎన్నికల సమయంలో ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఉద్యోగాలు, ఉచిత విద్య వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన అఖిలేశ్ ఈసారి ఉచిత ప్రెషర్ కుక్కర్లు, స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో మహిళలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. యూపీ మహిళలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రియాంక-డింపుల్ ప్రచారం బాగా కలిసి వస్తుందని, ఇటు రాహుల్-అఖిలేశ్ లోకల్ ముద్ర కూడా బీజేపీకి చెక్ పెడుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బరిలో కీలక పోటీదారుగా ఉన్నా మోదీ, బీజేపీ లక్ష్యంగానే ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ప్రచారం నిర్వహించనుందని తెలుస్తోంది.