ఇక సమైక్య ఉద్యమ తుపాను: అశోక్‌బాబు
అమలాపురం, న్యూస్‌లైన్: ప్రస్తుతం వరు స తుపానుల తీవ్రత ఎలా ఉందో.. భవిష్యత్‌లో సమైక్యాంధ్ర ఉద్యమాల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో శుక్రవారం జరగాల్సిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను వాయిదా వేసినట్టు ఆయన ఇక్కడ విలేకరులతో చెప్పారు. రాష్ట్ర విభజన జరగదని తాము సమ్మెకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి చెబుతూనే ఉన్నామని, అయితే ఇంకా విభజన ముప్పు పూర్తిగా తప్పిపోయిందని చెప్పలేమన్నారు.
జీఓఎం పేర్కొన్న 11 అంశాల్లో అన్నింటిపైనా ఏకాభిప్రాయం అసాధ్యమన్నారు. జీఓఎం నివేదిక వచ్చాక కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి క్యాబినెట్‌కు ఇవ్వడం, అక్కడ నుంచి రాష్ట్రపతికి వెళ్లడం, ఆ తరువాత రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపడం వంటివన్నీ డిసెంబరు 25లోగా ముగిసే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ఈనెల 24న హైదరాబాద్‌లో రాష్ట్ర ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నామని అశోక్‌బాబు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.