హామీల అమలులో బాబు విఫలం
ఆళ్లగడ్డ: హామీలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ ఆరోపించారు. పట్టణంలోని ఓ పంక్షన్ హాలులో శుక్రవారం గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో గిరిజనులకు చంద్రబాబునాయుడు 25 హామీలు ఇచ్చారాన్నరు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా 500 జనాభా దాటిన తండాలను, గూడేలను, గిరిజన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామన్నాని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో సీఎం కెసీఆర్.. ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా ఇప్పటికే ఓ కమిటీ వేశారన్నారు. ఏపీలో చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వం వద్ద లెక్కలు లేవన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు గిరిజన మంత్రిని కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారిని చేయడం విచారకరమన్నారు. గిరిజన శాఖకకు చైర్మన్‌ను నియమించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు నాగు నాయక్, ఆర్వీ ప్రసాద్, బాలాజీ, రవీంద్రనాయక్, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.