పనిమనిషి ‘మన మనిషి’ కాలేదా?
అనారోగ్యంతో పనిమనిషి సెలవు పెడితే ఇంటెడు పని ఎలా చేసుకోవాలా అని టెన్షన్ పడతాం... చేయలేక అవస్థపడతాం. అందుకే ఓ చిన్న సలహా. అడపా దడపా ఆమెకు చీర లు, వస్తువులు కొనిపెట్టే బదులు, ఆ డబ్బుకు మరికొంత జతచేసి ఓ హెల్త్ పాలసీ చేయించండి. అది ఆమెకే కాదు, మనకూ ఉపయోగమే. రేపెప్పుడైనా ఆమె మనింట్లో పనిచేస్తూనో, మన ఇంటికొస్తూనో ఏదైనా ప్రమాదం బారిన పడితే... అప్పటికప్పుడు మనం డబ్బు సర్దలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది.
‘‘ఏవండీ... కొత్త పనిమనిషిని చూడాలి’’... ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతోన్న భర్తతో అంది సునంద. ‘‘అదేంటి... ఉంది కదా?’’... అయోమయంగా అన్నాడు భర్త.
‘‘ఉంది కాదు... ఉండేది. రేపట్నుంచి రాదు.’’
‘‘మళ్లీ మాన్పించేశావా? ఇలా వచ్చినవాళ్లందరినీ వెళ్లగొడితే ఇంకెవరు చేస్తారు మనింట్లో’’... విసుగ్గా అన్నాడు. ‘‘ఎందుకు చేయరు? డబ్బులిస్తున్నాం కదా! అయినా నన్నంటారేంటి? వాళ్లు సరిగ్గా ఉంటే నేనెందుకు మాన్పిస్తాను?’’... విరుచుకుపడింది సునంద. ఇంకేం చెప్పినా వినదని అర్థమై మౌనంగా వెళ్లిపోయాడు భర్త.
సునందకి రోషంతో పాటు దుఃఖం కూడా పొడుచుకు వచ్చింది. పనిమనిషి మానేసిన ప్రతిసారీ భర్త తననే ఎందుకు తిడతాడో, వాళ్లు పని మానేయడానికి తనెలా కారణమవుతుందో అర్థం కాదామెకి. ఆమెకే కాదు... ‘వాళ్లు పని చేస్తున్నారు, మనం డబ్బులిస్తున్నాం’ అన్న ఆలోచనతో ఉండే ఏ యజమానురాలికీ ఇది అర్థం కాదు.
పనిమనిషిని పనిచేసే మనిషిగానే చూస్తాం తప్ప మన మనిషిగా ఎప్పుడూ అనుకోం. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని రోజుకోసారి తిట్టేస్తాం. పండగలకి చీరలు కొనిపెట్టి, పేద్ద ఫేవర్ చేసినట్టు ఫీలవుతాం. మన అవసరం తీరితే చాలు, ఆమె గురించి మనకు అనవసరం అన్నట్టుంటాం. అందుకే కొందరికి పనివాళ్లతో ఎలాంటి బంధం ఏర్పడదు.
మనకు అన్ని బంధాలూ ముఖ్యమే. భర్తతో అనుబంధాన్ని పదిలంగా కాపాడుకుంటాం. పిల్లలతో బలమైన అనుబంధాన్ని పెనవేసుకుంటాం. స్నేహితులతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. చివరకు బాస్‌తో కూడా మంచి అనుబంధం ఉండాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా మన పనివాళ్లతో అనుబంధం ఏర్పరచుకోవాలని అనుకున్నామా?
ఉద్యోగాలు చేసుకునేవారికి వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకైతే రెండురోజులు. అవి కాక పండుగలు, పబ్లిక్ హాలీడేస్ అంటూ ప్రత్యేక సెలవులు బోలెడు. కానీ పనిమనిషికి మాత్రం ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆమె రాకపోతే మనకి రోజు గడవదు. ఓపిక లేదని సెలవు అడిగినా ఒప్పుకోం. మన పని చేసి పెట్టి, మనకు విశ్రాంతినిచ్చే ఆమె విశ్రాంతి సంగతి? ఏం... పనివాళ్లకు అనారోగ్యాలు రావా? మనకైతే అనారోగ్యం, పనిమనిషిదైతే వంకా? మనకైతే బ్రేక్, వాళ్లయితే తప్పించుకోవడమూనా? పైగా ఎన్ని రోజులు రాలేదో లెక్కపెట్టి మరీ జీతం కట్ చేస్తాం. ఏ యాక్సిడెంటో అయ్యి రాలేకపోయినా నిర్దయగా వేతనం కట్చేసేస్తాం. మనమిచ్చే ఆ కాస్త డబ్బు మీద ఆధారపడి సాగే జీవితాలు వాళ్లవి. ఒక పూట తింటే రెండోపూట తిండి కోసం తడుముకునే పరిస్థితులు వాళ్లవి. అయినా అవన్నీ మనకు పట్టవు. వాళ్లు పని చేయలేదు, మన జీతమివ్వం. అంతే మన ఫిలాసఫీ!
ఇక పండుగలొస్తే... ఆమె మన ఇల్లంతా శుభ్రం చేయాలి. అలంకరించాలి. పిండి వంటలవీ కూడా చేయాలి. మొత్తంగా మన పండుగ ఆమె చేతుల మీదుగా ఆనందంగా ముగిసిపోవాలి. ఎంతసేపూ మన ఇంటి పనే సరిపోతే... మరి ఆమెఎప్పుడు పండుగ చేసుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? తనూ మనిషే. తనకూ సరదాలుంటాయి; తనూ ఒకింటి ఇల్లాలే, తనకీ కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశం మనం ఆమెకి ఇస్తున్నామా? పోనీ మన కోసం కష్టపడుతోందని, ఆమె ఇంట్లో పండుగకు అవసరమైనవన్నీ మనమే సమకూర్చుతామా అంటే అదీ లేదు. ఒక్క చీర పెట్టి చేయి దులిపేసుకుంటాం. కాసిన్ని పిండివంటలతో నోరు తీపిచేసి వదిలేస్తాం. ఇది... పనిమనిషికి పండగేంటిలే అన్న అల్ప భావమా లేక మన అవసరం తీరాకే మిగిలినవన్నీ అనే స్వార్థమా! లేకపోతే జీతమిస్తున్నాం కాబట్టి మనమేం చెప్పినా చేయాలన్న భావనా!
పనిమనిషి అంటే... ‘మనీ తీసుకుని పని చేసే షి’ అన్నాడో మహానుభావుడు. మనం కూడా అదే భావనతో ఉంటున్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఒకరోజు రాకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. సింకులో ఎంగిలి గిన్నెలు, ఇంటి నిండా చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లు, గోడలకు వేళ్లాడుతూ వెక్కిరించే బూజులు, నన్ను ఖాళీ చేయండి అంటూ ముక్కు పుటాలను అదరగొట్టి మరీ పిలిచే డస్ట్‌బిన్... వీటినుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో తెలియంది కాదు. మనల్ని ఆ కష్టం నుంచి తప్పించే మన మనిషి పనిమనిషి. మనతో ఉండి, మనకోసం అంత కష్టపడే మనిషిని బాగా చూసుకోవడం మనం ధర్మం. ఆమె విలువను ఇప్పటికైనా గుర్తిద్దాం.
అలాగని యజమానురాళ్లే ఇబ్బంది పెడతారు, పనివాళ్లంతా మంచివాళ్లే అని చెప్పడం లేదు. వాళ్లలోనూ రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లుంటారు. డుమ్మాలు కొట్టి మన మంచితనానికి పరీక్షలు పెట్టేవాళ్లు, ఎడ్డెం అంటే తెడ్డెమని విసిగించేవాళ్లు ఉంటారు. కానీ కొన్ని కావాలంటే కొన్ని భరించక తప్పదు. భర్తలో లోపాలుంటే భరించడం లేదా? పిల్లలు విసిగిస్తుంటే సహించడం లేదా? తల్లిదండ్రులతోటి స్పర్థలు వచ్చినా సర్దుకుపోవడం లేదా? మరి పని మనిషి దగ్గర కాస్త సర్దుకుపోవడానికెందుకంత ఇగో! అయినా ఆ సర్దుబాటు ఆమె కోసమే కాదు... మనకోసం కూడా. మనం ఆమెతో అడ్జస్ట్ అయితే వాదోపవాదాలకు తావుండదు.
మనకు బీపీ పెరగదు, మనశ్శాంతి చెడిపోదు, ఆమె మానేస్తుందన్న భయం ఉండదు, మరొకరిని వెతుక్కునే టెన్షనూ ఉండదు. అందుకే వీలైతే ఆమెను డీల్ చేయడం నేర్చుకోండి. లేదంటే అడ్జస్ట్ అయినా అయిపోండి. అంతేకానీ, రోజూ తగవుపడి, సతాయించి, మనమీదే ఆధారపడి బతుకుతోన్న చిన్నవాళ్ల మీద పెత్తనం చెలాయించకండి. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోకండి. అనుబంధాలను పెంచుకుంటే ఆనందం పెరుగుతుంది. అందుకే పనివాళ్లతో కూడా మంచి బంధాన్ని ఏర్పరచుకోండి. వాళ్లను మీరు బాగా చూసుకోండి... అప్పుడు వాళ్లూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు!
ఆఫ్ట్రాల్... లైఫ్ ఈజ్ అబౌట్ గివ్ అండ్ టేక్!
- సమీర నేలపూడి