samisragudem
-
వైద్యరంగంలో సత్ఫలితాలిస్తున్న నాడు-నేడు పనులు
-
భారీముప్పు!
నిడదవోలు: నిడవోలులో పురాతన వంతెన కూలినా అధికారులు కళ్లుతెరవడం లేదు. భారీ ముప్పు పొంచి ఉన్నా.. శిథిలావస్థలో ఉన్న వంతెనల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదు. కూలిన నిడదవోలు వంతెనకు కూతవేటు దూరంలో ఉన్న సమిశ్రగూడెం వంతెనను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ వంతెనపై రాకపోకలకు ప్రస్తుతం ప్రజలు వణుకుతున్నారు. సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో 1932లో నిర్మించిన ఐరన్ గడ్డర్ బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన 50 మీటర్ల పొడవు, ఆరుమీటర్ల వెడల్పు ఉంటుంది. గతంలో దీని శ్లాబ్ పనులు మాత్రమే చేపట్టారు. ప్రస్తుతం వంతెన ఐరన్ గడ్డర్లు తుప్పుపట్టాయి. గడ్డర్ల ముక్కలు పట్టు వదలి ఒక్కొక్కటిగా కాలువలోకి వేలాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. నిబంధనలు పట్టవు ఇంతటి భయానక పరిస్థితి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం.. ఈ వంతెనపై 16 టన్నులకు మించిన లోడు వాహనాలు తిరగకూడదు. అయితే ప్రస్తుతం 80 టన్నుల లోడు వాహనాలూ యథేచ్ఛగా పోతున్నాయి. అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కనీసం 16 టన్నులలోపు లోడు వాహనాలు మాత్రమే వెళ్లాలనే హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. ఇసుక, క్వారీ లారీలతోపాటు కోళ్ల పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తుల భారీ లోడు వాహనాలు రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ వంతెనపై రెండు వాహనాలు ఒకేసారి రావడానికి వీలుండదు. అయినా చాలా సందర్భాల్లో రెండు వాహనాలు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. దీంతో పోలీసులకూ తలనొప్పిగా మారింది. ఒక్కోసారి వంతెనపై భారీ వాహనాలు నిలిచిపోయి 200 టన్నుల భారం వంతెనపై పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వంతెన కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. వంతెనకు రెయిలింగ్ కూడా లేకపోవడంతో కాలువలోకి వాహనాలు దూసుకుపోయిన ఘటనలు అనేకం జరిగాయి. రాత్రి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రధాన మార్గం ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. తాడేపల్లిగూడెం, నిడదవోలు, పంగిడి, దేవరపల్లి నుంచి రాజమండ్రి, నరసాపురం, ధవళేశ్వరం, రావులపాలెం, మార్టేరుకు వెళ్లాలంటే ఈ వంతెన దగ్గరదారి. అందుకే ఎక్కువమంది వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. రోజూ వంతెన పైనుంచి సుమారు 5,000 వేల వాహనాలు వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన వంతెన శిథిలావస్థకు చేరినా.. అధికారులకు పట్టడం లేదు. నిడదవోలు బ్రిడ్జి కూలిన తర్వాత కూడా దీనిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించలేదు. ప్రతిపాదనలకే పరిమితం చాలాకాలం నుంచి వంతెన పడగొట్టి దాని స్థానంలో కాంక్రీట్ హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 2014లో రూ.10 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదిలా ఉంటే జలరవాణాలో భాగంగా వంతెన పొడవు పెంచాలనే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలతో వంతెన నిర్మాణ వ్యయం ప్రస్తుతం రూ.24 కోట్లకు పెరిగింది. పొంతన లేని సమాధానాలు ఈ వంతెన గురించి వివరణ కోరగా ఆర్అండ్ బీ ఏఈ కె.నందకిషోర్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అడగ్గా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు ఆర్అండ్బీ డీఈ ఎ.శ్రీకాంత్‌ను వివరణ కోసం యత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్‌చేయట్లేదు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
సమిశ్రగూడెం (నిడదవోలు) : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్ స్టీరింగ్ విఫలమై అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పుంతలో ముసలమ్మ ఆలయం మీదకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి వెళుతుండగా సమిశ్రగూడెం వచ్చేసరికి స్టీరింగ్ విఫలమైంది. దీంతో డ్రైవర్ జి.సుందరబాబు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న పుంతలో ముసలమ్మ ఆలయాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సుందరబాబుతో పాటు బ్రాహ్మణగూడేనికి చెందిన చిన్నం నాగేశ్వరరావు, పెరవలి మండలం ఏలేడుపాడుకు చెందిన పేరిశెట్టి భావనఋషి, కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన షేక్ అమ్మాజీ, తణుకు పట్టణానికి చెందిన మొక్కపాటి సత్యనారాయణ, అతని భార్య సక్కుబాయికు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆలయం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందు భాగంలోని అద్దాలలో నుంచి ఆలయ కాంక్రీటు దిమ్మలు, రేకులు చొచ్చుకువచ్చాయి. నిడదవోలు రూరల్ ఎస్సై కె.నరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
సమిశ్రగూడెం (నిడదవోలురూరల్), న్యూస్‌లైన్: జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి వి.నాగార్జునసాగర్ అన్నారు. మంగళవారం సమిశ్రగూడెం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2.63 కోట్లు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.1.01 కోట్లతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పైపులైన్ల నిర్వాహణకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. దీంతోపాటు శాశ్వత ప్రాతిపదికన సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజీవ్‌గాంథీ స్వశక్తి యోజనలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో 50 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసినట్టు నాగార్జునసాగర్ తెలిపారు. ఒక్కో భవన వ్యయం రూ.15 లక్షలుగా అంచనా సిద్ధం చేశామన్నారు. నిర్మల్‌భారత్ అభియాన్ పథకంలో భాగంగా అవసరమైన ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు పన్నులు వసూళ్లతో వనరులు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. అనధికారికంగా నిర్వహించే పరిశ్రమలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా పంచాయతీలు ఆదాయం రాబట్టుకోవాలన్నారు. 10వ తరగతిలో నూటికి నూరుశాతం మెరుగైన ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఎంఈవో వంగా సూర్యనారాయణమూర్తిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎంపీడీవో ఎస్.నిర్మలజ్యోతి పాల్గొన్నారు.