ఈ బుడతడి మరో సంచలనం
వాషింగ్టన్ : ఫేస్బుక్లో పలు రకాల కామెంట్లతో పదే పదే చక్కర్లు కొట్టే ఈ బుడతడు గుర్తున్నాడా.. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ 'సక్సెస్ కిడ్' ఫొటో సుపరిచితమే. వివిధ సందర్భాల్లో తమ సంతోషాన్ని, విజయాన్ని పంచుకోవడానికో, లేదా సరదాగానో ఈ ఫోటోను షేర్ చేయనివారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి పాపులారిటీ సంపాదించిందీ ఫొటో. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ ఫొటో అనేక హిట్లు, షేర్లు సాధిస్తూనే ఉంది. మరి అంతమంది నెటిజన్లకు కిక్ ఇచ్చిన ఈ ఫొటో ఎవరు తీశారో తెలుసా? ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేకు చెందిన లేనీ గ్రైనర్. ఆమె తన 11 నెలల కొడుకును ఫొటోను తన ఫ్లికర్ అకౌంట్లో సరదాగా 2007 ఆగస్టు 26న పోస్ట్ చేసింది. అప్పటి నుంచి.. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ా ఫొటో చక్కర్లు కొడుతూనే ఉంది. అంతేకాదు ఇంటర్నెట్లో సుదీర్ఘ కాలం ఆదరణ పొందిన ఫొటోల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఇపుడు ఎనిమిదేళ్ళ బుడతడు సామీ గ్రైనర్ మళ్లీ తెరపైకి వచ్చాడు. అయితే ఇపుడు సరదాగా కాదు.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తండ్రి జస్టిన్ గ్రైనర్కి సహాయం చేయాల్సిందిగా కోరుతూ!! తన తండ్రికి అవయవమార్పిడి చేయాల్సి ఉందని, దానికి సుమారు రూ. 47 లక్షల వరకు ఖర్చవుతుందనీ.. సహాయం చేయాలని కోరుతో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో విపరీతమైన స్పందన వచ్చింది. వేలాదిమంది దాతలు ముందుకు రావడంతో ఆపరేషన్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ జమఅయ్యింది. టార్టెట్‌ను మించి అంటే సుమారు రూ. 50 లక్షలవరకు వసూలైంది. అంతేకాదు.. అవసరమైతే, తమ కిడ్నీకూడా దానం చేస్తామంటూ కొందరు ముందుకు వచ్చారు. ఇన్నేళ్లుగా తమ ఆనందానికి కారణమైన మీ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే అంటూ చాలామంది కామెంట్స్ పోస్ట్ చేశారు.