breaking news
Samudhrala Samudhrala charyulu
-
కార్యదీక్షాపరుడు
ప్రతి వ్యక్తి ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏ పనీ చేయకుండా ఎవడూ ఉండడు. కొందరు ‘ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాను. ఖాళీగా కూర్చున్నాను’ అంటారు. కానీ ఒక రకంగా అది కూడా ఒక పనియే అని వారు గుర్తించాలి. తమ ప్రయోజనంతోపాటు తోటివారి శ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు నిర్వహించే వారిని, అలాగే ఐహిక శ్రేయస్సునందించే లౌకిక కార్యకలాపాలతోపాటు పారమార్థికమైన, మోక్షోపయోగియైన కార్యనిర్వహణకై కృషి చేసే వారిని ఉత్తమ కార్యదీక్షాదక్షులని చెపుతారు. మహనీయుల మహితోక్తులలోని సారాన్ని వంటబట్టించుకోవడంలో, ఆచరించడంలో వచ్చే కష్టసుఖాలను, లాభనష్టాలను పరిగణనలోకి తీసుకొనరాదు. చినిగిన వస్త్రాన్ని - పట్టువస్త్రాన్ని, సాధారణ భోజనాన్ని - పంచభక్ష్య పరమాన్నాలను, కటిక నేలను - పట్టు పరుపులను సమంగా భావించాలి. అప్పుడే అతడు నిజమైన కార్యసాధకుడిగా, ధీరుడిగా గుర్తింపు పొందుతాడు. ఈ విధమైన కార్యసాధకుడి లక్షణాలను భర్తృహరి మహాకవి అనాడే ఎంతో రమ్యంగా ఈ కింది సూక్తిరత్నంలో పేర్కొన్నాడు. క్వచిత్ పృథ్వీశయ్యః క్వచిదపిచ పర్యంకశయనః క్వచిత్ శాకాహారః క్వచిదపిచ శాల్యోదనరుచిః క్వచిత్ కంథాధారీ క్వచిదపిచ దివ్యాంబరధరో మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖమ్॥ జన్మ తరించుటకవసరమైన సజ్జనసాంగత్యాన్ని పొంది, స్థిరచిత్తముతో ఎవడైతే లక్ష్యసాధనకు నడుంబిగించి కృషి చేస్తాడో అట్టివాడిని పెద్ద సమస్యలు కూడా అడ్డగించలేవని మన పూర్వకవు ల భావన. అసాధ్యసాధకులైన, సుధీరులైన, నిశ్చల మనస్కులైన మహనీయులను మార్గదర్శకులుగా భావిస్తూ కర్తవ్య నిర్వహణ చేసేవాడికి అగ్ని చల్లటి నీటివలె కనిపిస్తుందేకాని కాల్చివేసేదిగా ఉండదు. అదే విధంగా సముద్రమేమో ఒక చిన్న కాల్వగా, మేరు పర్వతం ఒక చిన్న పాషాణఖండంగా, మృగరాజైన సింహం ఒకలేడి (జింక) పిల్లగా, మహావిషసర్పము ఒక పూలదండగా, కాలకూటవిషం అమృతంలాగా కనిపిస్తుందని భర్తృహరి మహాకవి దృఢచిత్తుడైన ఉత్తమకార్యసాధకుడి మానసిక స్థితిని ప్రతిబింబింపచేస్తూ పేర్కొన్న ఈ సుభాషిత రత్నాన్ని ఆస్వాదిద్దాం; వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్ క్షణాత్ మేరుః స్వల్పశిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే వ్యాలో మాల్య గుణాయతే విషరసః పీయూష వర్షాయతే యస్యాంగే ఖిల లోక వల్లభతమం శీలం సమున్మీలతి॥ కార్యనిర్వహణ చేసే వ్యక్తికి ఉత్సాహం, పట్టుదల, శ్రద్ధ, ఆసక్తి, అంకితభావం వంటి గుణాలు అవసరం. ఈ సద్గుణాలు కలిగిన కార్యకర్త ప్రతిపనిలో విజయాన్ని పొందుతాడు. కార్యనిర్వహణ సమయంలో అతి తొందర పనికిరాదు. అట్లే ఉదాసీన భావన కూడా పనికి రాదు. వివేకవంతుడై కార్యారంభాన్ని చేయాలి. ఆరంభించిన కార్యాన్ని మధ్యలో తొట్రుపాటు చెందకుండా పూర్తి చేయాలి. ప్రాణహితకరమైన ఉత్తమకార్యాలను మనస్సులో సంకల్పించాలి. వాటిని వెంటనే ఆచరణలో పెట్టాలి. ప్రారంభించిన ఆ ఉత్తమకార్యాలను నిరాంటకంగా పూర్తిచేసి సత్ఫలితాలను పొందాలి. ఈ విధంగా మనుష్యులు నిరంతరం ఉత్తమ కార్యసాధనకై కృషిచేస్తూ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని, అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను పొంది ధన్యచరితులు కావాలని ఆశిద్దాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
వినయాభరణం
ప్రతి వ్యక్తికి ఉండవలసిన గుణాలలో ‘వినయం’ ముఖ్యమైనది. ఎంతటి విద్యావంతుడైనా, గొప్ప పదవిలో ఉన్నా, కోటీశ్వరుడైనా వినయం లేకపోతే తగిన గౌరవాన్ని పొందలేడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనే విషయాన్ని ‘విద్యా వినయేన శోభతే’ అనే సూక్తి తెలియచేస్తుంది. వినయం విద్యకు ఆభరణం వంటిదని ‘శ్రుతస్య వినయో’ అనే మాటతో మహాకవి భర్తృహరి పేర్కొన్నాడు. తోటివారి నుంచి ఆదరాభిమానాలూ, గౌరవం పొందాలంటే ఐదు లక్షణాలు ఉండాలంటారు. అవి వస్త్రం, శరీరం, వాక్కు, విద్య. వాటితోపాటు వినయం కూడా. సదసద్వివేకవంతుడైన మానవుడికి విద్య వల్లనే వివేకం సిద్ధిస్తుందని, వినయం వల్లనే సత్ప్రవర్తన అలవడుతుందని ‘విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతామ్’ అనే సూక్తి రత్నం ఉద్భోదిస్తుంది. కవికుల గురువు కాళిదాసు సాటిలేని మేటి కవిగా ఖ్యాతి గాంచినా తనను గురించి సామాన్యుడిగానే చెప్పుకున్నాడు. సామాన్యుడైన తాను అసామాన్యమైన కవి యశస్సంపదను కాంక్షిస్తున్నానని, చిన్న తెడ్డు సాయంతో మహా సముద్రాన్ని దాటాలని ప్రయత్నించానని రఘువంశ మహా కావ్యారంభంలో పేర్కొన్నాడు. ‘‘అథవా కృత వాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః’’ అనే శ్లోకంలో దీనిని వివరించాడు. కాళిదాసు వినయం సకల మానవాళికి, కవి పండితులందరికి అనుసరణీయమై నిలిచేటటువంటిది. కల్యాణగుణాభిరాముడు, పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా సాటిలేని మేటి వినయసంపన్నుడే. బ్రహ్మాది దేవతలు, వసిష్టవిశ్వామిత్రాది మహర్షులు శ్రీరాముడిని దేవదేవుడిగా మహాత్మునిగా పేర్కొన్నా, ఆయన తనను తాను ‘ఆత్మానాం మానుషం మన్యే’ అని మానవునిగానే భావించుకున్నాడు. రామభక్తుడైన హనుమంతుడు కూడా తన ప్రభువైన శ్రీరామునిలోని వినయాన్ని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే తనను గూర్చి పరిచయం చేసుకునే సందర్భంలో ‘దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః’ అని వినయంగా రామదాసుడను అని చెప్పుకున్నాడు. సీతమ్మ తల్లి హనుమంతుని శక్తియుక్తులను గుర్తెరిగి ‘సముద్ర లంఘనం’ అనే మహత్కార్యాన్ని సాధించగలిగే శక్తి వినతాసుతుడైన గరుత్మంతునికి, వాయుపుత్రుడవైన నీకు, అట్లే వాయుదేవునికి మాత్రమే ఉంది అని ప్రశంసించింది. ఇంకా సముద్రాన్ని లంఘించి, ఒంటరిగానే రాక్షసపురమైన ఈ లంకలో ప్రవేశించినందువల్ల నీవు సమర్థుడవు, ప్రాజ్ఞుడవు, విక్రముడవు, వానరోత్తముడవు అని కీర్తిం చింది అమ్మవారు. అయినా హనుమ, తాను వానరులలో అగ్రేసరుడను కాననీ, అవరుడను(చినవాడిని) అని విన్నవించుకున్నాడు. ‘అమ్మా! సీతమ్మ తల్లీ! సూచిరమ్మని కాని, దూతగా కాని చిన్నవారినే పంపుతారు కాని, పెద్దవారిని పంపరు కదమ్మా!’ అని కూడా అన్నాడు. నేనే ఈ లంకకు రాగలిగానంటే నాకంటే బలవంతులైన అక్కడి వానరులంతా ఇక్కడకు తప్పక రాగలరు. నా కంటె గొప్పవారు, నాతో సమానమైనవారే వానర సైన్యంలో ఉన్నారు కానీ, నా కంటె తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు- ‘‘అహం తావదిహ ప్రాప్తః కింపునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ’’ అని పలికిన హనుమంతుని వినయ సంపద అందరికీ ఆదర్శప్రాయమైనది. ఆభరణంగా అలంకరించుకొనదగినది. - సముద్రాల శఠగోపాలాచార్యులు