వినయాభరణం | Humility only can make increase of self Esteem | Sakshi
Sakshi News home page

వినయాభరణం

Published Fri, Feb 7 2014 3:59 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

వినయాభరణం - Sakshi

వినయాభరణం

ప్రతి వ్యక్తికి ఉండవలసిన గుణాలలో ‘వినయం’ ముఖ్యమైనది. ఎంతటి విద్యావంతుడైనా, గొప్ప పదవిలో ఉన్నా, కోటీశ్వరుడైనా వినయం లేకపోతే తగిన గౌరవాన్ని పొందలేడు.

ప్రతి వ్యక్తికి ఉండవలసిన గుణాలలో ‘వినయం’ ముఖ్యమైనది. ఎంతటి విద్యావంతుడైనా, గొప్ప పదవిలో ఉన్నా, కోటీశ్వరుడైనా వినయం లేకపోతే తగిన గౌరవాన్ని పొందలేడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనే విషయాన్ని ‘విద్యా వినయేన శోభతే’ అనే సూక్తి తెలియచేస్తుంది. వినయం విద్యకు ఆభరణం వంటిదని ‘శ్రుతస్య వినయో’ అనే మాటతో మహాకవి భర్తృహరి పేర్కొన్నాడు.
 
 తోటివారి నుంచి ఆదరాభిమానాలూ, గౌరవం పొందాలంటే ఐదు లక్షణాలు ఉండాలంటారు. అవి వస్త్రం, శరీరం, వాక్కు, విద్య. వాటితోపాటు వినయం కూడా. సదసద్వివేకవంతుడైన మానవుడికి విద్య వల్లనే వివేకం సిద్ధిస్తుందని, వినయం వల్లనే సత్ప్రవర్తన అలవడుతుందని ‘విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతామ్’ అనే సూక్తి రత్నం ఉద్భోదిస్తుంది.
 
 కవికుల గురువు కాళిదాసు సాటిలేని మేటి కవిగా ఖ్యాతి గాంచినా తనను గురించి సామాన్యుడిగానే చెప్పుకున్నాడు. సామాన్యుడైన తాను అసామాన్యమైన కవి యశస్సంపదను కాంక్షిస్తున్నానని, చిన్న తెడ్డు సాయంతో మహా సముద్రాన్ని దాటాలని ప్రయత్నించానని రఘువంశ మహా కావ్యారంభంలో పేర్కొన్నాడు.
 ‘‘అథవా కృత వాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః
 మణౌ వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః’’
 అనే శ్లోకంలో దీనిని వివరించాడు. కాళిదాసు వినయం సకల మానవాళికి, కవి పండితులందరికి అనుసరణీయమై నిలిచేటటువంటిది.
 
 కల్యాణగుణాభిరాముడు, పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా సాటిలేని మేటి వినయసంపన్నుడే.
 బ్రహ్మాది దేవతలు, వసిష్టవిశ్వామిత్రాది మహర్షులు శ్రీరాముడిని దేవదేవుడిగా మహాత్మునిగా పేర్కొన్నా, ఆయన తనను తాను ‘ఆత్మానాం మానుషం మన్యే’ అని మానవునిగానే భావించుకున్నాడు.
 రామభక్తుడైన హనుమంతుడు కూడా తన ప్రభువైన శ్రీరామునిలోని వినయాన్ని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే తనను గూర్చి పరిచయం చేసుకునే సందర్భంలో ‘దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః’ అని వినయంగా రామదాసుడను అని చెప్పుకున్నాడు.
 
 సీతమ్మ తల్లి హనుమంతుని శక్తియుక్తులను గుర్తెరిగి ‘సముద్ర లంఘనం’ అనే మహత్కార్యాన్ని సాధించగలిగే శక్తి వినతాసుతుడైన గరుత్మంతునికి, వాయుపుత్రుడవైన నీకు, అట్లే వాయుదేవునికి మాత్రమే ఉంది అని ప్రశంసించింది. ఇంకా సముద్రాన్ని లంఘించి, ఒంటరిగానే రాక్షసపురమైన ఈ లంకలో ప్రవేశించినందువల్ల నీవు సమర్థుడవు, ప్రాజ్ఞుడవు, విక్రముడవు, వానరోత్తముడవు అని కీర్తిం చింది అమ్మవారు. అయినా హనుమ, తాను వానరులలో అగ్రేసరుడను కాననీ, అవరుడను(చినవాడిని) అని విన్నవించుకున్నాడు. ‘అమ్మా! సీతమ్మ తల్లీ! సూచిరమ్మని కాని, దూతగా కాని చిన్నవారినే పంపుతారు కాని, పెద్దవారిని పంపరు కదమ్మా!’ అని కూడా అన్నాడు.
 నేనే ఈ లంకకు రాగలిగానంటే నాకంటే బలవంతులైన అక్కడి వానరులంతా ఇక్కడకు తప్పక రాగలరు. నా కంటె గొప్పవారు, నాతో సమానమైనవారే వానర సైన్యంలో ఉన్నారు కానీ, నా కంటె తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు-
 ‘‘అహం తావదిహ ప్రాప్తః కింపునస్తే మహాబలాః
 నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః
 మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః
 మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ’’
 అని పలికిన హనుమంతుని వినయ సంపద అందరికీ ఆదర్శప్రాయమైనది. ఆభరణంగా అలంకరించుకొనదగినది.
 - సముద్రాల శఠగోపాలాచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement