samudrala venugopalachari
-
స‘ముద్రా’ల ఎక్కడ..?
సాక్షిప్రతినిధి, మంచిర్యాల: తెలుగుదేశం పార్టీలో కీలకనేత ఆయన. చంద్రబాబుకు సమకాలికుడిగా... నమ్మకమైన వ్యక్తిగా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఇక ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయనే సుప్రీం... టికెట్ల కేటాయింపులు, పదవుల పంపకాల్లో ఆయన చెప్పిందే వేదం... ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఎందరో నాయకులకు రాజకీయ గురువుగా మారారు. అలాంటి నేత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మౌనంగా వీక్షిస్తున్నారు. ఆయనే... సముద్రాల వేణుగోపాలాచారి. 1985లో నిర్మల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసింది మొదలు టీడీపీ నుంచి బయటకు వచ్చిన 2012 వరకు రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా చలామణి అయిన ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎదురులేని నాయకుడిగా... 1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా తొలి విజయం అందుకున్న చారి.. ఎన్టీరామారావు సైతం ఓటమి పాలైన 1989లో కూడా నిర్మల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీలో పట్టు సాధించిన ఆయన చంద్రబాబు వర్గంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తనతో పాటే 1985లో సిద్దిపేట నుంచి గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఆనాటి నుంచి చారి తెలుగుదేశం పార్టీని వీడేంత వరకు పార్టీలో కీలకమైన నాయకుడిగా వ్యవహరించారు. ఎందరో నేతలు చారి కనుసన్నల్లో ఉన్నత స్థానాల్లోకి ఎదిగారు. మొన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రజాప్రతినిధులుగా వ్యవరించిన నేతల్లో ఎక్కువ శాతం మంది వేణుగోపాలచారి రాజకీయ నీడలో ఎదిగినవారే అనడంలో అతిశయోక్తి లేదు. 2014లో ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవడం తొలిదెబ్బ అనే చెప్పాలి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ సాధించిన ఏకైక సీటు విఠల్‌రెడ్డిదే కావడం చారిని కుంగదీసిందనే అనుకోవాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ పాత మిత్రుడైన చారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదా కట్టబెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజకీయాలు నడిపించిన వేణుగోపాలాచారి 2014లో ఓటమి తరువాత ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితం కావలసిన పరిస్థితి ఎదురైంది. ముథోల్‌లో తనపై గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరి ఇప్పుడు మరోసారి టికెట్టు తెచ్చుకోవడాన్ని చారితో పాటు ఆయన వర్గీయులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. 1985లో తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడూ ఆదిలాబాద్ రాజకీయాలకు దూరంగా లేని చారి ఈసారి కనీసం పోటీ చేసే అవకాశానికి నోచుకోవడం విధి వైపరీత్యమే! రాష్ట్ర మంత్రిగా... కేంద్రమంత్రిగా... 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన చారి దేవేగౌడ, ఐకే గుజ్రాల్ మంత్రివర్గంలో సంప్రదాయేతర ఇంధనవనరుల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి గెలిచి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1999లో మూడోసారి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచి 2004 వరకు కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా ఓడిపోయిన ఆయన 2009లో కొత్తగా ఏర్పాటైన ముథోల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ముథోల్ నుంచి మరోసారి విజయం సాధించిన ఆయన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నిల్లో ఓటమిపాలు కావడం గమనార్హం. -
ఇదేమి హాజరు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు కీలకమైన వేదిక శాసనసభ. ఎంతటి జఠిలమైన సమస్య అయినా సభాదృష్టికి తీసుకెళ్తే ముకుమ్మడి తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎమ్మెల్యేలు సభల్లో పాల్గొని సమస్యలపై పాలకవర్గాలను నిలదీయాలి. సాధించుకునేంత వరకు పట్టుబట్టే అవకాశం ఉంది. అటువంటి మహత్తర అవకాశం శాసనసభ్యులకు మాత్ర మే ఉంది. ఆ ఆశతోనే 2009తో పది మంది ఎమ్మెల్యేలను జిల్లావాసు లు అసెంబ్లీకి పంపించారు. ఎమ్మెల్యేలు ఏం చేశారు. ప్రజల ఆశలను నీరుగార్చారు. ఏజెన్సీలో ఆరోగ్యం అదుపుతప్పి అడవిబిడ్డలు ఏటా వందల మంది మృత్యువాత పడ్డారు. గల్ఫ్ బాధితుల ఇళ్లలో అంతులేని విషాదం. కొందరు అన్నదాతలు ప్రతికూల పరిస్థితులతో కాటికి వెళ్లారు. డీజిల్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అసంపూర్తి ప్రాజెక్టులు, ఉచి త కరెంటుకు మంగళం.. బడుగులకు అందని సంక్షేమ పథకాలతో ప్రజలు సతమతం అయ్యా రు.. ఈ నాలుగున్నరేళ్లలో ఇటువంటి సమస్యలపై స్పందించాల్సిన మన ఎమ్మెల్యేలు సమావేశాలకు తక్కువగా హాజరయ్యారు. ప్రజల పనుల కంటే తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. శాసనసభ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎమ్మెల్యేల హాజరు శాతం ఆందోళన కలిగిస్తోంది. నాలుగున్నరేళ్లలో 177 రోజుల పాటు 13వ శాసనసభ సమావేశాలు జరిగాయి. మన జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 100 రోజుల వరకు అసెంబ్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యపోక తప్పదు. డుమ్మాలో మొదటి స్థానంలో కాంగ్రెస్.. 2009 జూన్‌లో 13వ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నాలుగున్నరేళ్లలో 177 రోజులపాటు అసెంబ్లీ సమావేశమైంది. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి 157 రోజులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ 154 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిర్మల్ ఎమ్మెలే మహేశ్వర్‌రెడ్డి 95 రోజులు హాజరై 82 రోజులు డుమ్మా కొట్టి జిల్లా శాసనసభ్యుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 104 రోజులు సమావేశాలకు హాజరై, 73 రోజులపాటు దూరంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోడం నగేశ్ 131 రోజులు సమావేశాల్లో పాల్గొని, 46 రోజులు దూరంగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ 56 రోజులు అసెంబ్లీకి ఎగనామం పెట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 2011లో రాజీనామా చేసి ఆ ఏడాది డిసెంబర్లో 5 రోజులు అసెంబ్లీకి దూరంగా ఉన్నా.. మొత్తంగా 67 రోజులు శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్యలు రాజీనామా చేయడం వల్ల 2010 ఫిబ్రవరి-మార్చిలలో 31 రోజులపాటు జరిగిన 4వ సెషన్ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. వీటిని కలుపుకుని ఆ ముగ్గురు వరుసగా 115, 100, 71 రోజులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో ప్రజలు ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తే.. అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ఈ రీతిలో గైర్హాజర్ అయితే ఎలా? అన్న చర్చ పలువురిలో సాగుతోంది.