సైకత శిల్పాంజలి
వలంధర్‌ఘాట్/స్టీమర్‌రోడ్డు (నరసాపురం): గోదావరి పుష్కరాల సందర్భంగా కళాకారులు సైకతశిల్పాలను రూపుదిద్ది గోదారమ్మకు కళాంజలి ఘటిస్తున్నారు. నరసాపురంలో ఇసుకరీచ్ వద్ద ఏర్పాటు చేసిన సైకత శిల్పకళా ప్రదర్శనలో కళాకారులు ఇసుకతో తీర్చిదిద్దిన సైకతశిల్పాలు పుష్కరయాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన గేదెల హరికృష్ణ ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన సుబల మహరానా..ఇద్దరూ సైకత శిల్పకళలో ఆరితేరి పలు పురస్కారాలు అందుకున్నవారే.
డిగ్రీ చదివిన హరికృష్ణ టూరిజం శాఖ ఆహ్వానం మేరకు గోదావరి పుష్కరాలకు నరసాపురం వచ్చి పుష్కర యాత్రికులకు తమ కళానైపుణ్యంతో ధ్యానంలో ఉన్న గౌతమ బుద్ధుడు, విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనా, స్వచ్ఛభారత్, గోదావరిపై బ్రిడ్జి నమూనా (రాజమండ్రి) బొమ్మలు తయారు చేశారు. మరో సైకత శిల్పి సుబల మహరానా ఇప్పటి వరకూ 100 అవార్డుల వరకు స్వీకరించిన ఉత్తమ శిల్పి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చిరుద్యోగి.