గూగుల్ వాయిస్ సెర్చ్‌లో మన యాసలకూ చోటు!
న్యూఢిల్లీ: గూగుల్ వాయిస్ సెర్చ్.. తెలుగులో చెప్పాలంటే గూగుల్ స్వర శోధన. దీన్ని వాడాలనుకున్నా.. వాడలేక ఇబ్బందిపడుతున్న భారతీయులకు శుభవార్త. ఇకపై తమ ‘గూగుల్ వాయిస్ సెర్చ్’ భారతీయ యాసలు, ఉచ్చారణలను కూడా సులభంగా గుర్తించగలదని గూగుల్ మంగళవారం వెల్లడించింది. గూగుల్ వాయిస్ సెర్చ్ అన్నది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి బాగా సుపరిచితమైన శోధనా అప్లికేషన్.
మనం గూగుల్లోగాని, ఫోన్లోగాని ఏదైనా వెతకాలంటే అక్షరాలు టైప్ చేయాల్సిన పని లేకుండా కేవలం నోటి మాటతో చెబితే చాలు ‘గూగుల్ వాయిస్ సెర్చ్’ వెంటనే మనకు వెతికిపెడుతుంది. అయితే దీనికో చిక్కొచ్చి పడింది. ఆంగ్లంలోనే మాట్లాడాల్సి వచ్చినప్పటికీ.. మన భారతీయ ఉచ్చారణ, యాసలను సరిగా గుర్తించలేకపోయేది. ఇకపై ఆ సమస్య లేకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామని, ఆంగ్లాన్ని మన యాసలో మాట్లాడినా అది గుర్తిస్తుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి సందీప్ మీనన్ తెలిపారు.