బలప్రదర్శన
సంగారెడ్డి టీఆర్ఎస్లో టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
జిల్లా కేంద్రం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ ఎవరికి వారుగా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎదుట ఇరువర్గాలు ఇటీవల బలప్రదర్శన కూడా చేసినట్లు సమాచారం. గతంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆర్.సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చింతా ప్రభాకర్ తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరారు.
అప్పటి నుంచే అటు సత్యనారాయణ, ఇటు చింతా ప్రభాకర్ నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి కా లంలో ప్రభాకర్‌కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించడంతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రభాకర్ నియోజకవర్గానికి దూరంగా ఉండటం, జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణకు పదవి కట్టబెట్టడంతో నియోజకవర్గ టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు కొం తకాలం స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల ప్రభాకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్గత విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్.సత్యనారాయణ తన వాదన వినిపించేందుకు ఓ బృందాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆరేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేసిన వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ’ ఈ బృందం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించింది.
అయితే అనారోగ్య కారణాల వల్ల సదరు బృందంతో కేసీఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్‌ను కలిసేందుకు సత్యనారాయణ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన ఓ ముఖ్య నేతను పార్టీలో చేర్చేందుకు ఆర్. సత్యనారాయణ మంతనాలు సాగిస్తున్నారు.
కేసీఆర్ ఎదుట బలప్రదర్శన
ఆర్. సత్యనారాయణ ప్రయత్నాలు పసిగట్టిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ తన మద్దతుదారులతో కేసీఆర్ ఎదుట బలప్రదర్శన జరిపారు. ఈ నెల మూడో తేదీన నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, క్రియాశీల కార్యకర్తలను వెంటబెట్టుకుని కేసీఆర్ వద్దకు వెళ్లారు. ‘సంగారెడ్డిలో పార్టీని బలోపేతం చేయాల్సిందిగా’ సూచించిన కేసీఆర్ పరోక్షంగా ప్రభాకర్‌కు అనుకూలంగా సంకేతాలు ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా టికెట్ ఆశిస్తున్న నేతలను పిలిచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.