సంగారెడ్డి ఆస్పత్రిలో దారుణం.. పోలీసుల నిర్లక్ష్యం, 15 రోజులు మార్చురీలోనే
సాక్షి, సంగారెడ్డి: పోలీసులు.. డాక్టర్ల నిర్లక్ష్యంతో 15 రోజులు మార్చురీలోనే ఓ మృతదేహం కుళ్లిపోయింది. చివరకు సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు.. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ పెద్దఎత్తున సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఉదంతం పూర్వాపరాలిలా..
గత నెల 18వ తేదీన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న శ్రీనివాస్(28)కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. డిసెంబర్ 23న మృతి చెందాడు. వాస్తవానికి 108 సిబ్బంది 18వ తేదీనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా వారు స్పందించకపోవడం.. మృతుడికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మార్చురీకి తరలించారు.
దాదాపు పదిహేనురోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడాన్ని గమనించిన అక్కడి ఉద్యోగులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శవాన్ని తరలించే క్రమంలో మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డును పరిశీలించారు. అందులో ఉన్న వివరాల మేరకు మృతుడు ఝరాసంఘం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.
పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు పోలీసుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అదే సమయంలో జిల్లా పరిషత్ జనరల్‌బాడీ సమావేశానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు నినాదాలు చేసుకుంటూ ఆస్పత్రి నుంచి జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చదవండి: గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్!
బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం
విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు, డాక్టర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్‌ను మంత్రి ఆదేశించారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు.
కాగా, భర్త మృతిపై మంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే అడ్డుకొని కర్కశంగా తన కడుపులో కాలుతో తన్నిందని మృతుడు శ్రీనివాస్ భార్య సంగీత ఓ మహిళా కానిస్టేబుల్, పోలీసుల తీరుపై మండిపడుతూ రోడ్డుపై రోదించిన తీరు కలచివేసింది. శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్టుగా పనిచేస్తూ జీవనం సాగించేవాడని, వారం, పదిహేనురోజులకోసారి షూటింగ్‌ల నుంచి ఇంటికి వచ్చి వెళ్తారని ఆ నమ్మకంతోనే కుటుంబసభ్యులు శ్రీనివాస్ గురించి ఆరా తీయలేదని చెబుతున్నారు.