పిడుగుల్లాంటి పిల్లలతో ‘సంగుచక్రం’
తమిళ సినిమా: మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో సంగుచక్రం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మారశన్ పేర్కొన్నారు. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియోవిజన్ వీఎస్.రాజ్‌కుమార్, సినిమావాలా పిక్చర్స్ కే.సతీష్ కలిసి నిర్మించిన తాజా చిత్రం సంగుచక్రం.
ఈ సినిమాలో దిలీప్ సుబ్బరాయన్, గీతా, జర్నిరోస్తో పాటు పలువురు బాల తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఫబీర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయనిట్ చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ.. ఇది పిల్లల ఇతి వృత్తంతో కూడిన వినోదాన్ని మేళవించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పది మందికి పైగా బాల తారలు ముఖ్య పాత్రల్లో నటించారని చెప్పారు.
30 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో దెయ్యం ఇతి వృత్తంతో సాగే కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రంలో పిల్లలే దెయాన్ని భయపెడతారని చెప్పారు. ఇందులో కథానాయకిగా నటించిన గీత షూటింగ్ 20 రోజుల్లో భూమి మీద ఉన్న దాని కంటే తాడుతో కట్టబడి పైన వేలాడిన రోజులే అధికం అని చెప్పారు. అయినా పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో గీత నొప్పిని భరించి నటించారని తెలిపారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు మారీశన్ తెలిపారు. ఈయన అసలు పేరు రంజిత్. మరణించిన తన తండ్రి మారి జ్ఞాపకార్థం తన పేరును మారీశన్‌గా మార్చుకున్నారు.