జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: మంత్రి
సంగారెడ్డి అర్బన్: పారిశుద్ధ్య వసతుల కల్పనలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో యూనిసెఫ్, మెడ్వాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నీరు, పారిశుద్ధ్య సమన్వయ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజధానికి దగ్గర్లో ఉన్న జిల్లాలో మురుగుదొడ్లు లేని నివాసాలు 60 శాతం ఉండటం బాధాకరమన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో పారిశుద్ధ్య వసతులైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేశామని, అదే స్ఫూర్తితో జిల్లాలోని మిగతా అన్ని నియోజక వర్గాలలో కూడా వంద శాతం పారిశుద్ధ్య వసతులు కల్పించడానికి అందరు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అందరి సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణానికి కృషిచేయాలన్నారు. జిల్లాలో ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుద్ధ్యం మీద సర్వే నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా జిల్లాను ఈ విషయంలో మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. యూనిసెఫ్ చీఫ్ రుత్ లిమానో మాట్లాడుతూ, జిల్లాలో నీరు , పారిశుద్ధ్య వసతుల కల్పనకు ఎల్లవేళలా సహకరిస్తామన్నారు. అనంతరం మంత్రి యూనిసెఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫొటోగ్రఫీ వర్క్ షాప్‌లో పాల్గొన్న 11 మంది బాల రిపోర్టర్లకు డిజిటల్ కెమెరాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, మెడ్వాన్ ప్రెసిడెంట్ మనోహర్, యూనిసెఫ్ కన్సల్టెంట్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.