త్వరలో విస్తరణ
సాక్షి, ముంబై: త్వరలో రాష్ట్ర మంత్రిమండలిని విస్తరించనున్నట్లు ముఖ్యంత్రి చవాన్ పరోక్షంగా వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రమంత్రులు గెలుపొందినట్లయితే ఖాళీ అయిన వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో ఉండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉన్నా కాంగ్రె స్, ఎన్సీపీ నేతల్లో మంత్రిపదవులను దక్కించుకునే పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. కొత్తవారికి అవకాశం దక్కడంతోపాటు ఉన్నవారి శాఖలు కూడా మార్చే అవకాశముందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు రాష్ట్ర మంత్రులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.
కాంగ్రెస్లో....
లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో అయిదుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా తమ కోటాలోని మూడు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్కు చెందిన సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘే, పర్యావరణశాఖ మంత్రి సంజయ్ దేవ్తలేలు లోకసభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిద్దరు విజయం సాధించి నట్టయితే మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ ఐదు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు దక్కనున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మంత్రిపదవుల రేసులో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే తదితర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు కూడా మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఇప్పటినుంచే ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.
ఎన్సీపీలో...
లోక్సభ ఫలితాల అనంతరం మంత్రి మండలి విస్తరించనున్నట్టు సంకేతాలు వెలువడంతో ఎన్సీపీ నేతల్లో ఆశలో చిగురించాయి. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్బల్, జలవనరులశాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు సురేష్ దస్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా విజయం సాధించినట్టయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ కానున్న వీరి స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తే మరికొందరికి అవకాశం దక్కుతుంది.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ నాయకులలో జితేంద్ర అవాడ్కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనతోపాటు ప్రకాశ్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్బల్, పంకజ్ భుజ్బల్ తదితరులు కూడా మంత్రిపదవుల రేసులో ఉన్నారని చెబుతున్నారు.