sanjay khanna
-
న్యాయవ్యవస్థ కళ్లు తెరవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని ఉన్నత న్యాయవ్యవస్థకు సంబంధించి జనవరి పదవ తేదీన రెండు వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి సంజయ్ ఖన్నాను సుప్రీం కోర్టుకు నియమించడాన్ని విమర్శిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ కైలాష్ గంభీర్ రాష్ట్రపతికి లేఖ రాయడం. రెండూ డిసెంబర్ 12వ తేదీన సుప్రీంకోర్టుకు ఇద్దరు జడ్జీలను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసుకోవడం. 32 మంది జడ్జీల సీనియారిటీని కాదని సంజయ్ ఖన్నాను సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారని గంభీర్ ఆరోపించారు. మరి ఈనేపథ్యంలోనే ఇద్దరు జడ్జీల నియామకాన్ని సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసుకుందో మాత్రం వెల్లడించలేదు. జడ్జీలే జడ్జీలను నియమించే వ్యవస్థ ఒక్క భారత దేశంలో తప్పా ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలతో కూడిన కొలీజియం హైకోర్టులు, సుప్రీం కోర్టుకు జడ్జీలను నియమిస్తుంది. ఈ పద్ధతి 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే నియామకాలు జరిపేది. ఆ పద్ధతి వల్లన కేంద్రంలో అధికారంలో ఉండే రాజకీయ పార్టీ ప్రభావం నియామకాలపై ఉంటుందన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థను మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రయత్నించి విఫలమయింది. సుప్రీం కోర్టు కొలీజియం నియామకాల్లో కూడా కేంద్రం ప్రభావం అప్పుడప్పుడు కనిపించడం, నియామకాలు వివాదాస్పదం అవడం తెల్సిందే. ఇప్పుడు సంజయ్ ఖన్నా నియామకం వివాదాస్పదం కాగా, అంతకుముందు సుప్రీం కోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేసుకుందో, అందులో ఏమి అవతవకలు జరిగాయో అంతు చిక్కడంలేదు. ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత లోపించిన కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టం నుంచి సుప్రీం కోర్టు తనను తాను మినహాయించుకోవడం అంటేనే అది పారదర్శకతకు ఎంత విలువ ఇస్తుందో అర్థం అవుతోంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగింపునకు ఓటేసినందుకు ప్రత్యుపకారంగా జస్టిస్ సిక్రీని లండన్‌లోని ‘కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్’ నియామకానికి కేంద్రం సిఫార్సు చేసిందని జాతీయ మీడియాలో విమర్శలు రావడంతో సిక్రీ ఆ పదవిని తిరస్కరించడం కూడా ఇక్కడ గమనార్హం. ఇప్పటికైనా న్యాయవ్యవస్థ కళ్లు తెరచి తనను సరిదిద్దుకోవాలి. పారదర్శకతకు పెద్ద పీట వేయాలి. లేకపోతే న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలకు విశ్వాసం పోయే ప్రమాదం ఉంది. -
షీనాబోరా హత్యకు కారణాలివే..!
ముంబై: సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ లా సాగిపోతున్న షీనాబోరా హత్య కేసులో సీబీఐ విచారణ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్థిక కారణాలు, రాహుల్ ముఖర్జియాతో సంబంధం, ఇంద్రాణిని బ్లాక్మెయిల్ చేయడం లాంటివే షీనాబోరా హత్యకు ప్రధాన కారణాలని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్నది. కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలే షీనాబోరా హత్యకు కారణాలని పేర్కొంది. ముఖ్యంగా 1300 కోట్ల రూపాయల లావాదేవీలు ఇందులో ప్రధానమని తెలిపింది. తల్లీ కూతుళ్ల మధ్య నెలకొన్ని వివాదాలే ఇంద్రాణిని షీనా హత్యకు పురికొల్పాయని సీబీఐ తేల్చింది. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ, ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుత భర్త, మీడియా టై్కూన్ పీటర్ ముఖర్జియాను నాలుగో ముద్దాయిగా చేర్చింది. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా కేవలం ఆస్తి, డబ్బు కోసమే ఓ పథక ప్రకారం షీనాను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలని చూశారు. షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు నిధికే దక్కుతుందనేది సంజీవ్ పథకం. రాహుల్ ముఖర్జీ, షీనాల పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక మొదటినుంచి తల్లీ కూతుళ్ల మధ్య తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా రాహుల్ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు. పైగా షీనాపై ఉన్న ఆస్తులు తిరిగి తనకు దక్కవేమోనన్న భయం ఆమెను పట్టుకుంది. ఈ నేపథ్యంలో 2004 లో షీనాకు బహుమతిగా ఇచ్చిన ఏడు బెడ్రూంల ఫ్లాట్‌ను 2010లో ఆమెకు తెలియకుండానే ఇంద్రాణి విక్రయించింది. దీంతో వివాదం మరింత రగిలింది. తామిద్దరం ప్రపంచానికి తెలిసినట్టుగా అక్కాచెల్లెళ్లం కాదు, తల్లీకూతుళ్లమనే విషయాన్ని బయటపెడతానని షీనా బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఈ క్రమంలో షీనా హత్యకు పథకం వేశారని సీబీఐ పేర్కొంది. 'షీనా జాగ్రత్తగా ఉండు' అంటూ ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల రెండవ కూతురు విధి.. సోదరి షీనాకు ఒక ఎస్సెమ్మెస్ చేసినట్టు కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తల్లి ఇంద్రాణి పథకాన్ని పసిగట్టిన విధి షీనాను ముందుగానే హెచ్చరించిందని సీబీఐ పేర్కొంది. 2012, ఏప్రిల్ 24న ఇంద్రాణి ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి షీనా బోరాను హత్య చేసి మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐకి సవాల్‌గా మారింది.