రీ కిల్లింగ్
నగరంలో వరుసగా రీఫిల్లింగ్ ప్రమాదాలు
మేల్కోని పోలీసులు
తాజా ఘటనలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు
కాచిగూడ, న్యూస్‌లైన్: నగరంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు పోలీసులకు కొత్తేమీ కాదు. గతంలో సైదాబాద్‌లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ సమయంలో హడావుడి చేసిన అధికారులు చివరకు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాల గురించే మరిచిపోయారు. శనివారం రాత్రి కాచిగూడలోని సంజయ్‌గాంధీ నగర్లో తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో అధికారులందరు మేల్కొనక తప్పలేదు.
తాజా ఘటన వివరాలివీ.. ధూల్‌పేట్‌కు చెందిన బిరుజు, లోథిలు రెండేళ్ల నుంచి కాచిగూడలోని సంజయ్‌గాంధీ నగర్లో దీపక్‌సింగ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని అందులో అక్రమ గ్యాస్ రీపిల్లింగ్ కేంద్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా అక్కడి సిబ్బంది సహాయసహకారాలతో వినియోగదారులకు సరఫరా చేయాల్సిన వంటగ్యాస్ సిలిండర్లు అక్రమమార్గం ద్వారా ఇక్కడి గోడౌన్‌కు చేరుకుంటాయి.
ఇక్కడి నుంచి వీరు చిన్న సిలిండర్లతో పాటు ప్యాసింజర్ ఆటోలకు గ్యాస్‌ను నింపుతుంటారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ గౌడాన్‌లో ఆరుగురు వర్కర్లు పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గోడౌన్లో సుమారు 50కి పైగా సిలిండర్లు ఉన్నాయి. పెద్ద సిలిండర్‌లోంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్‌ను నింపుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పెద్ద పేలుడు సంభవించింది. దీంతో పాటే పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా ఆకాశాన్ని ఎగబాకాయి. గోడౌన్‌కు ఆనుకుని ఉన్న సుమారు 60 ఇళ్లలోని జనాలు తీవ్ర భయాందోళనలకు గురై ఒక్కసారిగా పరుగులు తీశారు.
ఈ సమయంలోనే గోదాంలో లేచిన మంటల ధాటికి ఒక్కో సిలిండర్ పేలుతుండటంతో ప్రాణాలు దక్కించుకునే క్రమంలో బస్తీవాసులు ఒక్కసారిగా రహదారి పైకి పరుగు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఘటనా స్థలంలో మాత్రం ఎనిమిది మంది యువకులు రక్తం మడుగులో కుప్పకూలి పోయారు. కొందరు స్థానికులు ధైర్యంచేసి వారిని 108లో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అయితే ఘటనాస్థలిలో నరేందర్ అనే యువకుడు చనిపోగా.. ఎనిమిది మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అదుపులోకి మంటలు
ఈ సమాచారం మేరకు గౌలిగూడ, మలక్‌పేట ఫైర్స్టేషన్లకు చెందిన నాలుగు ఫైరింజన్లు ప్రమాదస్థలికి చేరుకుని గోదాంలో చెలరేగిన మంటలు బస్తీలోకి వ్యాపించకుండా సకాలంలో ఆర్పేశాయి. ఘటనా స్థలానికి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఏసీపీ రంజన్త్రన్, ఇన్స్పెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింహారావు తదితరులు వచ్చారు. జనాలు ఘటనా స్థలానికి తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికితోడు రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు వరుసగా రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. రాత్రి 8 గంటల నుంచి 12 గంటలకు వరకు చాదర్‌ఘాట్ నుంచి అంబర్‌పేట వైపు వెళ్లే వాహనాలను కాచిగూడ, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట వైపు మళ్లించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ పాపం పోలీసు మామూళ్లదే
ఈ ప్రాంతంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతుందని స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సైతం సమాచారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా వారి నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ ఉండడం వల్లే అక్రమార్కులను చూసీచూడనట్లు వదిలే శారని స్థానికులు అంటున్నారు. ఈ ఘోరం జరగడానికి పోలీసులే పరోక్షంగా కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగకుండా... అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని మూసివేసి కేసులు నమోదు చేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ఫిర్యాదు చేసినా గతంలో పోలీసులు పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
హోం మంత్రి నాయిని
సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఘటన విషయం తెలియగానే ఆయన ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీతో కలిసి సంఘటనా స్థలానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారని ఆయన తెలిపారు. మంత్రి పద్మారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, కార్పొరేటర్ కన్నె ఉమారాణి, బీజేపీ నేతలు రమేష్ యాదవ్, ఎంబీటీ కార్పొరేటర్ అమ్జదుల్లాఖాన్, టీడీపీ నాయకులు మాజీ మంత్రి కృష్ణయాదవ్ తదితరులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.