sanjeev naik
-
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్): గిరిజనుల(ఎస్టీ) రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచటంతోపాటు గిరిజనబంధును ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్ అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని లంబాడి తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 4 శాతం ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచితే, ఇప్పుడు సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచటం గొప్ప పరిణామమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని కొనియాడారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేస్తానని చెప్పి 3,600 తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారని, ఇప్పుడు వాటన్నింటికీ గిరిజనులే సర్పంచులుగా ఉండటం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కళ్యాణనాయక్, నేతలు ఓబానాయక్, మున్నా, దేవేందర్, దేవరాజు, కృష్ణ, నందు తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతోనే శివసేన ఆరోపణలు
సాక్షి, ముంబై: పరాజయం పాలవుతామన్న భయంతోనే ఎన్సీపీ నాయకులపై శివసేన ఆరోపణలు గుప్పిస్తోందని ఠాణే ఎన్సీపీ అధ్యక్షుడు మనోజ్ ప్రధాన్ పేర్కొన్నారు. ఠాణే ఎన్సీపీ అభ్యర్థి సంజీవ్ నాయక్‌పై శివసేన ఉపనేత విజయ్ నాహటా చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మనోజ్ ప్రధాన్ మాట్లాడుతూ ఠాణే మన్సిపల్ కార్పొరేషన్లో జరిగిన 41 శాతం అవినీతి, కుంభకోణాలు ఎవరి హయాంలో జరిగాయో బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. ఠాణేలో జరిగిన అవినీతిపై ఏర్పాటుచేసిన నందలాల్ సమితి ఇచ్చిన నివేదికలో శివసేన అభ్యర్థి రాజన్ విచారే పేరు ఉందని ఆయన ఆరోపించారు. ఠాణే లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎన్సీపీ అభ్యర్థి సంజీవ్ నాయక్ అభివృద్ధి చేసినందునే అతడికి అనేక వర్గాలు, సంఘాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. దీన్ని చూసి తట్టుకోలేక శివసేన నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శివసేన అభ్యర్థి విజయ్ నాహటాకు షాపూర్లో ఉన్న 250 ఎకరాల స్థలం వివరాలను త్వరలోనే మీడియాకు అందిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎన్సీపీ నాయకులు అశోక్ పోహేకర్, ఠాణే కాంగ్రెస్ అధ్యక్షుడు బాలకృష్ణ పూర్ణేకర్ తదితరులు పాల్గొన్నారు. నరసింగ్ ఫౌండేషన్ మద్దతు... ఠాణే లోక్‌సభ నియోజకవ ర్గంలో మళ్లీ బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ, ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థి సంజీవ్ నాయక్‌కు బీహారీ సమాజానికి చెందిన శ్రీ నరసింగ్ ఫౌండేషన్ మద్దతు ప్రకటించింది. బీహారీ ప్రజలకు అన్ని విధాలుగా సహకరించినందునే సంజీవ్ నాయక్‌కు తాము మద్దతు ప్రకటించినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రభాత్ ఝూ తెలిపారు. కాగా, ఎన్సీపీ అభ్యర్థి సంజీవ్ నాయక్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు మల్లార్ పోలి ఆదివాసీ సమాజ్ మండల్ జిల్లా అధ్యక్షుడు సురేష్ భుయాల్ ప్రకటించారు.