అయోధ్యలో మళ్లీ ఉద్రిక్తత, పోలీసుల కఠిన ఆంక్షలు
విశ్వ హిందూ పరిషత్ శుక్రవారం అయోధ్యలో 'సంకల్ప సభ' నిర్వహించదలచిన నేపథ్యంలో ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. ఈ సభను అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అయోధ్య పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. ఎస్ఎమ్ఎస్లను నిషేధించింది. ముందు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 మందికిపైగా వీహెచ్‌పీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
రాష్ట్ర రాజధాని లక్నోలో 366 మందిని అరెస్టు చేశారు. వీరిలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సురేంద్ర మిశ్రా, అధికార ప్రతినిధి శరద్ శర్మ తదితరులున్నారు. అయోధ్యవైపు వెళ్లొద్దంటూ వీహెచ్‌పీ, దాని అనుబంధ సంస్థలను అధికారులు హెచ్చరించారు. లక్నో-గోరఖ్‌పూర్ మధ్య ట్రాఫిక్‌ను బారాబంకీ, గోండాబస్తీ, సుల్తాన్పూర్ మీదుగా మళ్లించారు. రాం విలాస్ వేదాంతి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ గురించిన సమాచారం ఏమీ లేదని శాంతిభద్రతల ఐజీ ఆర్కే విశ్వకర్మ తెలిపారు.
సభకు ప్రజలు వెళ్లకుండా నివారించేందుకు అయోధ్యతో పాటు ఫైజాబాద్ పట్టణాలకు వెళ్లే అన్ని దారులను పోలీసులు దిగ్భందించారు. రామమందిర ఉద్యమ నాయకులు నాయకులు మహంత్ గోపాల్‌దాస్, మహంత్ సురేశ్ దాస్, బ్రిజ్మోహన్ దాస్, అభిషేక్ మిశ్రా సహా 42 మందిని పోలీసులు గృహనిర్భందం చేశారు. విహెచ్పీ నాయకులు, కార్తకర్యలు ఎవరూ అయోధ్య వెళ్లరాదంటూ పోలీసులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ దేవ్‌రాజ్ నాగర్, హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ గుప్తా అయోధ్యలోనే మకాం వేసి భద్రతను సమీక్షిస్తున్నారు.