జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : జేఈఈ, నీట్ పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని రాయ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత శంకర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాలలో తీవ్రమైన వరదలు వచ్చాయని, అనేక చోట్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లటం వల్ల వాళ్లకు పరీక్షలు రాసే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేవలం పట్టణ ప్రాంత విద్యార్థులనే కాదు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవాలి. సమాన విద్యావకాశాలు అందరికీ కలగాలి. వరద ప్రాంతాల్లోని విద్యార్థులను పరీక్ష సెంటర్ల సమీపంలో ఒక వారం ముందే ప్రిపరేటరీ జోన్లో ఉంచాలి. లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎన్నడూ లేనంతగా అసాధారణ రీతిలో దేశవ్యాప్తంగా వరదలు వస్తున్నాయి. ( జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?)
కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే విద్యార్థులంతా మానసికంగా సిద్ధమయ్యారు. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సైతం ఈ అంశంలో మానవీయ దృక్పథంతో స్పందించాలి. పదిహేను రోజుల పాటు వాయిదా వేస్తే విద్యాసంవత్సరం నష్టం ఏమీ జరగదు. తీవ్రమైన వరదలతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పరీక్ష సెంటర్లకు చేరుకునేందుకు ఎటువంటి సదుపాయాలు లేవు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన పరీక్షకు అంగీకరించినట్లు కాద’’ని అన్నారు.