సీటుకు ఎసరు
శాసనమండలి చైర్మన్‌గిరిపై కాంగ్రెస్ కన్ను
జేడీఎస్ మద్దతుతో దక్కించుకునేందుకు యత్నం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో సంఖ్యా బలం పెరగడంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. జేడీఎస్ కూడా ఆ పార్టీకి మద్దతు పలకడానికి అంగీరించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రస్తుత చైర్మన్ డీహెచ్. శంకరమూర్తితో పాటు వైస్ చైర్పర్సన్ విమలా గౌడను పదవీచ్యుతులను చేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
బీజేపీకి చెందిన వీరిద్దరూ సభలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడం లేదనే సాకుతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలో మొత్తం సంఖ్యా బలం 75 కాగా 31 మంది సభ్యులతో బీజేపీ ఇప్పటికీ అతి పెద్ద పార్టీగా ఉంది. ఐదుగురు సభ్యులు నామినేట్ కావడం, అసెంబ్లీ నుంచి మండలికి జరగాల్సిన ఎన్నికల్లో నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గం నుంచి ఓ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది.
జేడీఎస్‌కు 12 మంది సభ్యులున్నారు. ముగ్గురు స్వతంత్ర సభ్యులు బైరతి సురేశ్, ఎండీ. లక్ష్మీనారాయణ, రఘు ఆచార్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో బీజేపీయేతర పార్టీల మొత్తం బలం 43కు పెరుగుతుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు జరగాల్సిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మరో ఇండిపెండెంట్ డీయూ. మల్లిఖార్జున్ తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో ఆయన బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎన్నికయ్యారు. ఆయనకు ఇప్పటికీ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఉంది. కనుక ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా కాంగ్రెస్‌కు సహకరించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.