ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే స్వాధీనమే
సభ్యులకు శాసన మండలి చైర్మన్ శంకరమూర్తి హెచ్చరిక
బెంగళూరు : శాసన మండలి కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే తమ మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆన్ చేస్తే.. వాటిని జప్తు చేసుకుంటామని శాసనమండలి చైర్మన్ డీ హెచ్ శంకరమూర్తి హెచ్చరించారు. శాసనసభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ తన ఫోన్లో ప్రియాంకగాంధీ చిత్రాలు చూడడంపై గురువారం కూడా శాసనమండలిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం నెలకొంది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ శంకరమూర్తి మాట్లాడుతూ...‘మండలిలోకి ప్రవేశించే ముందు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఇప్పటికే అనేక సార్లు సభ్యులకు చెప్పాను. అయినా ఎవరూ నా మాటకు విలువ ఇవ్వడం లేదు.
బెంగళూరులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మండలి కవరేజ్‌కు వచ్చిన ఓ రిపోర్టర్ సెల్‌ఫోన్ మోగింది. ఆ సమయంలో అతని ఫోన్‌ను నేను జప్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాను. ఇకపై మండలి సభ్యుల సెల్ఫోన్లు కనుక స్విచ్ ఆఫ్ చేయకుండా కనిపిస్తే వారి ఫోన్లను కూడా జప్తు చేసుకుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి’ అని సభ్యులను హెచ్చరించారు.