నెల్లై ఏకగ్రీవం
- మేయర్ అభ్యర్థి భువనేశ్వరి ఎన్నిక
- నామినేషన్ ఉపసంహరణతో ఖంగుతిన్న బీజేపీ
- శంకరన్ కోవిల్ సైతం ఏకగ్రీవం
సోమవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే శంకరన్కోవిల్ మునిసిపాలిటీ అన్నాడీఎంకే చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యూరు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కోయంబత్తూరు, తిరునెల్వేలీ, తూత్తుకూడి కార్పొరేషన్లకు, అరక్కోణం, విరుదాచలం, కడలూరు, పుదుకోట్టై, రామనాథపురం, కోడెకైనాల్, కున్నూరు, శంకరన్కోవిల్ మునిసిపాలిటీలకు ఈనెల 18న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఉప ఎన్నికలకు సంబంధించి గత నెల 28న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈనెల 4వ తేదీతో ముగిసింది. తిరునెల్వేలీ స్థానానికి అన్నాడీఎంకే అభ్యర్థిగా భువనేశ్వరి, బీజేపీ అభ్యర్థిగా వెల్లయమ్మాళ్తోపాటూ మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే 11 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో రంగంలో కేవలం అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులే నిలిచారు.
బీజేపీ బ్యాక్: స్థానిక సమరంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతుందని భావించారు. తన పేరును అమ్మ ప్రకటించగానే భువనేశ్వరి ప్రచారాన్ని ప్రారంభించేశారు. అయితే బీజేపీ అభ్యర్థి వెల్లయమ్మాళ్ ఆదివారం వరకు ప్రచారం జోలికి పోలేదు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఈనెల 10వ తేదీన తిరునెల్వేలీకి చేరుకుని బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారని చెప్పుకున్నారు. అయితే నాటకీయంగా సోమవారం ఎన్నికల అధికారిని కలుసుకున్న బీజేపీ అభ్యర్థి వెల్లయమ్మాళ్ తన నామినేషన్ను ఉపసంహరించారు.
ఈ విషయం బీజేపీ శ్రేణుల్లో కంగారు పుట్టించింది. పోటీల్లో ఉన్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకున్నందున అన్నాడీఎంకే మేయర్ అభ్యర్థి భువనేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారి లక్ష్మీ ప్రకటించారు. తిరునెల్వేలీ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోగా ఒకదానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, మరో వర్గానికి మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య నలిగిపోలేకనే పోటీ నుంచి వెల్లయమ్మాళ్ తప్పుకున్నట్లు భావిస్తున్నారు. తమ అభ్యర్థిని అధికార పక్షంవారు బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని తమిళిసై ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు హితవు పలుకుతున్నారని తప్పుపట్టారు. అనేకచోట్ల బీజేపీ అభ్యర్థులు కిడ్నాపులకు గురవుతున్నారని తమిళిసై ఆరోపించారు. ఎన్నికుయుక్తులు పన్నినా బీజేపీ వెరవదని ఆమె అన్నారు.
శంకరన్ కోవిల్ మునిసిపాలిటీ మేయర్ అభ్యర్థిగా రంగంలో ఉన్న రాజ్యలక్ష్మి (అన్నాడీఎంకే) ఏకగ్రీవంగా ఎన్నుకయ్యూరు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవతి, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ దినమైన సోమవారం నాడు కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్లను వాపస్ తీసుకోగా మేయర్ కుర్చీ అధికార పార్టీ పరమైంది. చెన్నై నగరంలో తాంబరం, పల్లవరం వార్డులు అన్నాడీఎంకేకు ఏకగ్రీవమయ్యరు.