6న రాజధానికి శంకుస్థాపన
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ కాలం హైదరాబాద్ నుంచి పరిపాలన చేయడం మంచిది కాదని, వీలైనంత త్వరగా కొత్త రాజధానికి తరలడానికి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. తొలుత ఏ శాఖలను తరలించాలి? విజయవాడలో అందుబాటులో ఉన్న భవనాలు ఎన్ని?.. తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని శాఖలను ఒకేసారి తరలించడం సాధ్యం కాదు కనుక తొలుత క్షేత్రస్థాయి అధికారులను కొత్త రాజధానికి పంపించాలని, తర్వాత దశల వారీగా కార్యాలయాల తరలింపును చేపట్టాలని భావించింది. రాష్ట్ర మంత్రివర్గం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. మత్స్య, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పర్యాటకం, ఈ-గవర్నెన్స్ విధానాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు మీడియాకు వెల్లడించారు. ముఖ్యాంశాలు ఇవీ..
సమీకరణకు ముందుకు రాని రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగించాలి. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి.ఈనెల 15 నుంచి 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీలను పాలనా అవసరాల మేరకు చేయడానికి అనుమతించాలి.జూన్ 2కు రాష్ట్రం ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది. ఆరోజు నవ నిర్మాణ దీక్ష చేపట్టాలి. ప్రభుత్వం చేపట్టిన మిషన్లు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి 2 నుంచి 7 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. 8న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అదనంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి చర్యలు చేపట్టాలి.
డ్వాక్రా మహిళలకు మూలధన వ్యయాన్ని వచ్చేనెల 2 నుంచి 8వ తేదీ వరకు చెక్కుల రూపంలో అందించాలి.రైతులకు రుణమాఫీ చేసినా.. ఇంకా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. గ్రామాల వారీగా రుణమాఫీ పొందిన రైతుల వివరాలు, వారి ఖాతాల్లో ఎంత జమయిందో పేర్కొంటూ అన్ని గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించాలి.
2020 నాటికి అగ్రగామిగా ఏపీ
పర్యాటక రంగంలో దేశంలో 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రూపొందించిన నూతన పర్యాటక విధానానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.{పస్తుతం ఏడాదికి 9 కోట్ల మంది దేశీయ పర్యాటకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నాలుగేళ్లలో 18 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించాలి.
{తీస్టార్ కన్నా ఎక్కువ స్థాయి హోటళ్లు, రిసార్ట్స్, హెరిటేజ్ హోటళ్లు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు, బొటానికల్ గార్డెన్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పురావస్తు ప్రదర్శన శాలలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. టూరిజం ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని బట్టి కనిష్టంగా 5 శాతం గరిష్టంగా 20 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. భూ మార్పిడి ఫీజు, స్టాంప్ డ్యూటీలను వంద శాతం రీయింబర్స్ చేస్తారు. పలు రకాల పన్ను మినహాయింపులు ఉంటాయి.ఈ-గవర్నెన్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతన ఈ-గవర్నెన్స్ ప్రొక్యూర్మెంట్ విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
3.50 లక్షల మందికి ఉపాధి
రాష్ట్రంలో రూ.15 వేల కోట్లతో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి.. 3.5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మూతపడిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.పారిశ్రామిక వాడల్లో 15% భూమిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయిస్తారు. భూ కేటాయింపులో రిజ ర్వేషన్ పాటించాలి. 5% మైనార్టీలు, 20% బీసీలు, 10% మహిళలకు కేటాయించాలి.వ్యాట్, సీఎస్టీ పదేళ్ల పాటు 100 శాతం రీయింబర్స్మెంట్. 15 శాతం వడ్డీ రాయితీ.. గరిష్టంగా రూ.20 లక్షలు ఇవ్వాలి. స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ చార్జీల నుంచి 100 % మినహాయింపు.