లబ్ధిదారుడికి అందజేసిన పట్టా పత్రం
రామాయంపేట, నిజాంపేట(మెదక్): రెండు పడకల ఇళ్ల నిర్మాణంకోసం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అయితే అరగంటలోపే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు నిర్మాణ స్థలం తమదిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి 40 రెండు పడకల ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి డిప్యూటీస్పీకర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడికి సమీపంలో తిరుమలస్వామి గుడివద్ద కార్యక్రమం జరుగుతుండగా గ్రామానికి చెందిన కొంతమంది దళిత మహిళలు శిలాఫలకం వద్ద వచ్చిన నిరసన తెలిపారు. ఈస్థలం తమదని, తమ అంగీకారం లేకుండా ఇక్కడ ఎలా పనులు ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహంతో ఊగిపోతూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనితో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, నిరసన తెలిపిన మహిళలకు మధ్య కొద్దిసేపు తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది.
అక్కడే ఉన్న విలేకరులకు తమకు ఎప్పుడు స్థలాలు మంజూరు చేశారో వివరించారు. ఇళ్లు నిర్మించుకోవడానికి 1999లో తమకు పట్టాసర్టిఫికెట్లు ఇచ్చారంటూ వాటిని చూపించారు. ఇప్పుడు అదేస్థలంలోడబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తే తామంతా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారని, అంతేకాకుండా తమ స్థలంలో ఇళ్లు నిర్మించడమేమిటని ప్రశ్నించారు. నిజాంపేట ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈవిషయంపై నిజాంపేట తహసిల్దార్ ఆనందరావును వివరణకోరగా కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని, స్థలం చదును చేసేటప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment