ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో సనోఫి సింథ్‌ల్యాబొ ఇండియా, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్, ఐడియా సెల్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిల్లో నెదర్లాండ్స్‌కు చెందిన రెసిఫ్రామ్ పార్టిసిపేషన్ బీవీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనే(రూ.950 కోట్లు) పెద్దది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) పలు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై చర్చించింది. మూడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తిరస్కరించగా, మరో ఆరు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఆమోదం పొందిన వాటిల్లో రూ.157 కోట్ల బోహిన్‌గిర్ ఇంగెలిహిమ్ ఇండియా, రూ.80 కోట్ల మెనరిని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలు ఉన్నాయి. వాయిదా పడిన ప్రతిపాదనల్లో క్రెస్ట్ ప్రెమీడియా సొల్యూషన్స్, యు బ్రాడ్‌బాండ్ ఇండియా, సైంటిఫిక్ పబ్లిషింగ సర్వీసెస్ ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 27 శాతం వృద్ధితో 2,187 కోట్ల డాలర్లకు పెరిగాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 3,094 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 4,000 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.