మన తెలుగు వాచకం
తెలంగాణ మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. అమ్మభాషతో తెలంగాణ తెలుగువాచకాలు తయారవుతున్నాయి. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సంస్కతీ సంప్రదాయాలు, విశిష్టమూర్తుల విశేషాలను సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొదలైంది.
ప్రజల ఆకాంక్షలను ప్రజా ఉద్యమంగా మలచటంలో, ఆ లక్ష్యం నెరవేరే వరకు తుదికంటా క్రియాశీల క పాత్ర పోషించి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగం నిలిచి గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తన పలుకుబళ్లతో తన భాషలో, తనయాసలో స్వేచ్ఛగా పాఠ్యప్రణాళికలను రచించుకుంటుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని అపూ ర్వంగా ఆవిష్కరించుకునే అరుదైన సందర్భమిది. తన మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ లోటును పూడ్చటానికి కొత్త పాఠ్యపుస్తకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాల సిలబస్‌లు కొత్తగా రచిస్తున్నారు. తెలంగాణ అమ్మభాషతో తెలంగాణ తెలుగు వాచకాలు తయారవుతున్నాయి.
మన విస్మృత సాహిత్యం విశ్వవేదికపై ఆవిష్కరించబోతున్న సందర్భమిది. తెలంగాణ లోని చారిత్రక ప్రదేశాలన్నీ ప్రపంచానికి తెలియ చేసేందుకు సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొద లైంది. మన సంస్కృతి, మన పండుగలు, మన ఆటలు, వినోదాలు, మన భాష, మన నుడికారం, మన భావజాలం, మన ఉద్యమం, మన పోరాట వారసత్వం, తెలుగు సాహిత్య చరిత్ర పేజీల్లోకి ఎక్కించే పనికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగా ణలో ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి.
పాన గల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఆలంపూర్లో ప్రఖ్యాత ఆలయం, పిల్లలమర్రి శివాలయం, బాసర సరస్వతి దేవాలయం, రామప్ప దేవాల యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేయిస్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ జాతర, భద్రాచలం రామాలయం లాంటి ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలు సిలబస్‌లోకి చేర్చేపని ముమ్మరంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ, దసరా, పీర్ల పండుగలు, మన ఏడుపాయల జాతరలు, జానపాడు సైదులు, దురాజ్‌పల్లి జాతరలు ప్రత్యేకంగా పిల్లలకు బోధనాంశాలవుతున్నాయి.
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో ప్రతిభావంతులైన మన తెలంగాణ మహనీయుల చరిత్ర పిల్లలకు బోధించే విధంగా సిలబస్ తీర్చిదిద్దబడుతుంది. 1 నుంచి 10 తరగతుల పిల్లలకు ఆయా తరగతుల స్థాయిని బట్టి పాఠాలు చెబుతారు. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అవతరించాక తెలుగు భాషలో పాఠ్యాం శాలను ప్రవేశపెట్టటమే పెద్దమార్పుగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుం టుంది.
తెలంగాణ పద్య సాహిత్యంలో మన పాల్కురికి, మన పోతన, కొరవి గోపరాజు, కందుకూరి రుద్రకవి, మల్లినాధసూరి, సురవరం ప్రతాపరెడ్డి, బి.ఎన్.శాస్త్రి, కపిలవాయి లింగ మూర్తి, హీరాలాల్ మోరియా, జమలాపురం కేశవరావు, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ లాంటి ఎందరెందరో తెలంగాణ సాహిత్య మణిరత్నాల చరిత్ర పిల్లలకు పాఠాలుగా ముందుకు రాబోతు న్నాయి. కాకతీయుల కాలం నాటి సమ్మక్క, సారలమ్మల చరిత్రతోపాటుగా ఆ కాలం నాటి తెలంగాణకు ప్రాణాధారమైన జీవధార గొలుసు కట్టు చెరువులు సిలబస్‌లోకి ఎక్కుతున్నాయి. స్థానికత నేపథ్యంలో బాలసాహిత్యం ప్రవేశపెట్టే పని మొదలైంది.
తెలంగాణకు పోరువారసత్వం ఎంతో బలమై నది. ప్రపంచపటంలో తెలంగాణకున్న గుర్తింపు పోరాట వారసత్వమేనన్నది మరువ రాదు. చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం, దొడ్డి కొమరయ్య భూమికోసం పోరాటం, బండి యాదగిరి ఉద్యమపాట, సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా అన్న పాట అంతర్జా తీయ మానవతాగీతం, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, నల్లా నర్సింహులు, ఉప్పల మలుసూరు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, 4,000 మంది నేలకొరిగిన పోరువీరుల చరిత్రను భావితరాలకు తెలియ జేయటం విధిగా జరగాలి.
వేరు తెలంగాణ పోరుకు ఊపిరిలూదిన 1969 ఉద్యమకారుల చరిత్ర దగ్గర నుంచి నేటి ఉద్యమ సాఫల్యం వరకు కీలక ఘటనలను పాఠాలుగా బోధించాలి. కాళోజీ, ప్రొ॥జయశంకర్ లాంటి వాళ్ల చరిత్రను ప్రవేశపెట్టాలి.
నిజాం కాలం నాటి అనుకూల, ప్రతికూల పరిస్థితులను నిష్కర్షగా ఉన్నది ఉన్నట్లుగా పాఠ్యాంశాలలో చేర్చగలగాలి. నిజాం కాలం నాటి సంస్కరణలు, మంచి పనులు చెప్పటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ ఆనాటి మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటాన్ని కూడా చెప్పాలి. నిజాం కాలంలో ఆనాటి ప్రజలు ఏ రకం గా అణిగిపోయారన్న చరిత్రను కూడా కళ్లకు కట్టిన ట్లు చెప్పాలి.
త్రివేణి సంగమమైన మట్టిపల్లి లక్ష్మీనర్సింహ స్వామి, కృష్ణా, గోదావరి, మూసీ నదులు శాత వాహనుల కోటిలింగాల చరిత్ర, బొమ్మలమ్మగుట్ట, సంగారెడ్డి దగ్గరున్న అనంత పద్మనాభస్వామి, మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరలాంటి తెలంగాణ తరతరాల వారసత్వ సంపదను కొత్తతరాలకు అందించాలి. ప్రధానంగా తెలుగు వాచకంలో మన తెలంగాణ భాషను ఎలా వ్యక్తీకరిస్తామో చెప్పగలగాలి. ప్రాచీన తెలంగాణ సాహిత్యం దగ్గర నుంచి ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జాతీయ సాహసబాలల చరిత్ర వరకూ సిలబస్‌లోకి ఎక్కాలి.
తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చి సామాజిక విప్లవాలకు సాక్ష్యాలుగా నిలిచిన శ్రీశ్రీ, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, జాషువా, కందుకూరి కృష్ణశాస్త్రి, ఆరుద్ర లాంటి కవులు, రచయితల సాహిత్యాన్ని తెలంగాణ నేల ఎప్పటికీ మరిచిపోలేదు. భిన్నభావాల, భిన్న అస్తిత్వాల, భిన్న పోరాటాల, విభిన్న చైతన్యాలకు నిలయమైన తెలంగాణ తనను తాను రాసుకుంటూ కొత్త చరిత్రకు ద్వారాలు తెరువ బోతుంది.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)